టాటా టెలీ కథ కంచికి!

Tata Tele cracks 14% as co looks to surrender, sell existing spectrum

దశల వారీగా కార్యకలాపాలకు స్వస్తి

ప్రమాదంలో 6,000 ఉద్యోగాలు  

ఆస్తులు విక్రయించి అప్పులు తీర్చే యోచన

న్యూఢిల్లీ: టెలికం రంగంలో గడ్డు పరిస్థితుల నేపథ్యంలో మరో కంపెనీ కథ కంచికి చేరనుంది. టాటా టెలీ సర్వీసెస్‌ ప్రయాణం త్వరలోనే ముగిసిపోనున్నట్టు తెలుస్తోంది. దశలవారీగా కార్యకలాపాలను టాటా టెలీ సర్వీసెస్‌ మూసివేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై కంపెనీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు చేసినట్టు సమాచారం. ఇదే జరిగితే 6,000 ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయి.

టాటా టెలీ బ్యాంకులకు 28,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. దీంతో ఆస్తులను నిలువునా అమ్మేసి అప్పులు తీర్చే అవకాశం ఉందని అంచనా. ఇప్పటి వరకు ఎన్నో ఏళ్లుగా టాటాలు టెలికం విభాగం కోసం రూ.50,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా ఆస్తుల విక్రయంతో వచ్చేది కొంతే.  టాటా గ్రూపు మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ లేఖ ఆధారంగా చూస్తే టాటా టెలీ సర్వీసెస్‌ను అర్ధంతరంగా మూసేస్తే గ్రూపునకు వాటిల్లే నష్టం రూ.32,000 కోట్లు. దీంతో పాటు భాగస్వామ్యం నుంచి వైదొలగినందుకు డొకోమోకు చెల్లించిన రూ.7,600 కోట్లు కూడా నష్టం కిందకే వస్తుంది.

2016–17 ఆర్థిక సంవత్సరంలో టాటా టెలీసర్వీసెస్‌ ఏకంగా రూ.4,517 కోట్ల నష్టాలను చవిచూసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టం రూ.2,023 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది. టర్నోవర్‌ రూ.9,419 కోట్లుగా ఉంది. ప్రస్తుతం టెలికం మార్కెట్లో ఈ కంపెనీ వాటా 3.5 శాతంగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో టాటా టెలి తనకున్న స్పెక్ట్రమ్‌ను తిరిగి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని ద్వారా కంపెనీకి రూ.10,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది.

అలాగే టవర్ల వ్యాపారం ఏటీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మిగిలి ఉన్న 32 శాతం వాటాను ఏటీసీకి విక్రయించడం వల్ల రూ.6,700 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే, కంపెనీకి దేశవ్యాప్తంగా 1,25,000 కిలోమీటర్ల మేర ఉన్న ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌ వర్క్‌ను  విక్రయించినట్టయితే మరో రూ.5,000–7,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top