
దక్షిణాదిన సుజుకి ప్లాంటు..!
జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్... భారత మార్కెట్లో సుస్థిర స్థానం సంపాదించే దిశగా అడుగులేస్తోంది.
2018-19 నాటికి సాకారమయ్యే అవకాశం
♦ ప్రస్తుత అమ్మకాల్లో 55 శాతం వాటా దక్షిణాదిదే
♦ గుర్గావ్ నుంచి రవాణాకు భారీగా వ్యయం
♦ అందుకే కొత్త ప్లాంటు; ఇక ఏటా ఒక కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్... భారత మార్కెట్లో సుస్థిర స్థానం సంపాదించే దిశగా అడుగులేస్తోంది. 2020 నాటికి వార్షిక అమ్మకాలను 10 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం హరియాణాలోని గుర్గావ్‌లో ఉన్న సంస్థ ప్లాంటు వార్షిక సామర్థ్యం 5.4 లక్షల యూనిట్లు. లక్ష్యానికి తగ్గట్టుగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి కనక కంపెనీ రెండో ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అన్నీ అనుకూలిస్తే 2018-19 నాటికి ఇది సాకారమవుతుంది. ప్రస్తుతం సుజుకీ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 55 శాతంగా ఉంది. దీంతో ప్లాంటు కూడా దక్షిణాదిలోనే ఏర్పాటు చేయొచ్చని కంపెనీ వర్గాలు తెలియజేశాయి. ఈ ప్రాంతంలో ప్లాంటు ఏర్పాటైతే రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గనుండడం కూడా కంపెనీ ఆలోచనకు మరో కారణంగా కనిపిస్తోంది.
కలసిరానున్న కొత్త ప్లాంటు..
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని డీలర్లకు స్కూటర్లు, మోటార్ సైకిళ్లను గుర్గావ్ ప్లాంటు నుంచి సరఫరా చేయడానికి ఒక్కో వాహనానికి సగటున రూ.1,600 ఖర్చు అవుతున్నట్లు సంస్థ జోనల్ సేల్స్ మేనేజర్ డి.వి.ప్రభాకర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటైతే ఈ ఖర్చులు గణనీయంగా తగ్గడం ఖాయం. ఇది ఆదాయంతోపాటు లాభాలపైనా సానుకూల ప్రభావం చూపిస్తుందనేది సంస్థ భావన. ముఖ్యంగా గుర్గావ్ ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని గరిష్ఠంగా 7 లక్షల యూనిట్ల వరకు మాత్రమే విస్తరించే అవకాశం ఉంది. ఇక సూపర్ బైక్ ‘హయబూస’ మోడళ్లను భారత్‌లో అసెంబుల్ చేయనున్నట్టు కంపెనీ ఇదివరకే ప్రకటించింది. 2020 నాటికి లక్ష్యంగా చేసుకున్న 10 లక్షల యూనిట్ల వార్షిక అమ్మకాల్లో ఎగుమతుల వాటా 20% ఉండొచ్చని సంస్థ అంచనా వేస్తోంది.
ఏడాదికి ఒక కొత్త మోడల్..
కంపెనీ భారత్‌లో లెట్స్, స్విష్, యాక్సెస్ పేర్లతో స్కూటర్లను... స్లింగ్‌షాట్, హయాతే, జిక్సర్ పేరిట బైక్‌లను విక్రయిస్తోంది. ఇటీవలే యాక్సెస్ 125, హయాతే అప్‌గ్రేడెడ్ వెర్షన్లను తీసుకొచ్చింది. వచ్చే ఐదేళ్లలో ప్రీమియం స్కూటర్లు, మోటార్ సైకిళ్లపైనే సంస్థ ఫోకస్ చేయనుంది. ఇందుకోసం ఏటా ఒక కొత్త మోడల్‌ను తీసుకొస్తామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కెంజి హిరోజవ వెల్లడించారు. విదేశాల్లో అందుబాటులో ఉన్న 150 సీసీ ఆపై సామర్థ్యమున్న స్కూటర్లను 2017 నుంచి కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టనుంది. భారత్‌లో 2014-15లో సుజుకీ 3.45 లక్షల యూనిట్లను విక్రయించింది. 2015-16లో మాత్రం ఈ సంఖ్య 3.2 లక్షలకు పరిమితం కానుంది. యాక్సెస్ నూతన వర్షన్ రావటంతో పాత మోడల్ తయారీని నియంత్రించామని, దీనివల్లే అమ్మకాలు తగ్గాయని కంపెనీ తెలిపింది.