బాకీలపై మరో మాట లేదు..

Supreme Court After Reserving Order On Window For AGR Dues - Sakshi

మళ్లీ మదింపు ప్రసక్తే లేదు 

ఏజీఆర్‌పై సుప్రీం కోర్టు స్పష్టీకరణ 

తదుపరి విచారణ ఆగస్టు 10కి వాయిదా

న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్‌) ఆధారంగా టెల్కోలు కట్టాల్సిన బకాయిలకు సంబంధించి టెలికం శాఖ (డాట్‌) లెక్కలపై మరో మాట మాట్లాడటానికి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వీటిని మరోసారి మదింపు చేయాలన్న టెల్కోల అభ్యర్థనను పట్టించుకునే ప్రసక్తే లేదని పేర్కొంది. ఏజీఆర్‌ బాకీల చెల్లింపునకు వ్యవధినిచ్చే అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. ఏజీఆర్‌ ఫార్ములా ప్రకారం స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బకాయిల కింద టెలికం సంస్థలు దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు చెల్లించాల్సి రానున్న సంగతి తెలిసిందే.

స్వీయ మదింపు ప్రకారం కొంత కట్టిన టెల్కోలు.. తమ బాకీలు డాట్‌ చెబుతున్నంత స్థాయిలో లేవని, పైగా ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున బకాయిలను కట్టేందుకు 20 ఏళ్ల దాకా వ్యవధినివ్వాలని సుప్రీం కోర్టును కోరుతున్నాయి. దీనిపై సోమవారం విచారణ సందర్భంగా అటు ప్రభుత్వం, ఇటు టెలికం సంస్థల వాదనలను సుప్రీం కోర్టు విన్నది. బాకీల పునఃమదింపు అంశాన్ని టెల్కోలు ప్రస్తావించగా.. ‘రీ–అసెస్‌మెంట్‌ విషయంలో మరొక్క క్షణం కూడా వాదనలు వినే ప్రసక్తే లేదు. ఏజీఆర్‌ నిర్వచనం ఖరారు చేశాం. దాని ఆధారంగా డాట్‌ బాకీల నోటీసులు కూడా పంపింది. దీన్ని మళ్లీ తెరిచే ప్రశ్నే లేదు‘ అని స్పష్టం చేసింది. ఇక, దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయంటున్న కంపెనీల వాదనల్లో వాస్తవాలను కూడా పరిశీలిస్తామని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top