Sakshi News home page

సన్‌ ఫార్మా లాభం రూ.1,472 కోట్లు

Published Wed, Feb 15 2017 1:24 AM

సన్‌ ఫార్మా  లాభం రూ.1,472 కోట్లు

క్యూ3లో 5 శాతం తగ్గుదల...
మొత్తం ఆదాయం రూ.7,913 కోట్లు


న్యూఢిల్లీ: సన్‌ ఫార్మా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,472 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.1,545 కోట్లు)తో పోల్చితే 5 శాతం క్షీణత నమోదైంది. గత క్యూ3లో రూ.7,122 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.7,913 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ దిలీప్‌ సంఘ్వి తెలిపారు. ప్రస్తుత వ్యాపార వృద్ధిపై దృష్టిని కొనసాగిస్తున్నామని, తక్షణం ఆదాయం అందించకపోయినప్పటికీ, ప్రత్యేక విభాగాలపై పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు.

అదనపు డైరెక్టర్‌ నియామకం..
మొత్తం అమ్మకాల్లో 26 శాతం వాటా ఉన్న భారత బ్రాండెడ్‌ ఫార్ములేషన్స్‌ విభాగం అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.1,969 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం ఆమ్మకాల్లో 45 శాతం వాటా ఉండే అమెరికా వ్యాపారం 4 శాతం వృద్ధితో 51 కోట్ల డాలర్లకు పెరిగిందని వివరించారు. తమ కంపెనీలకు చెందిన 424 అండా(అబ్రివియేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌)లకు అమెరికా  ఎఫ్‌డీఏ  ఆమోదం తెలిపిందని, ఎఫ్‌డీఏ ఆమోదం కోసం 149 అండాలను దరఖాస్తు చేశామని, 14 అండాలకు తాత్కాలిక ఆమోదం పొందామని వివరించారు. ఇక తమ కంపెనీ అదనపు డైరెక్టర్‌గా కళ్యాణసుందరమ్‌ సుబ్రహ్మణ్యమ్‌ను నియమించామని సంఘ్వి చెప్పారు.   ఫలితాల నేపథ్యంలో సన్‌ ఫార్మా షేర్‌ 0.7 శాతం క్షీణించి రూ.650 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement