సన్‌ ఫార్మా చేతికి జపాన్‌ పోలా ఫార్మా

Sun Pharma buys Japanese drug maker Pola Pharma for derma products - Sakshi

డీల్‌ విలువ 10 లక్షల డాలర్లు

న్యూఢిల్లీ: భారత ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్మా... జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనుంది. పోలా ఫార్మాను 10 లక్షల డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సన్‌ ఫార్మా వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చర్మ సంబంధిత ఔషధాల సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా పోలా ఫార్మాను టేకోవర్‌ చేస్తున్నామని సన్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ కీర్తి గనోర్కార్‌ తెలిపారు. దీని కోసం పోలా ఫార్మాతో ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. ఈ కంపెనీ టేకోవర్‌ వచ్చే ఏడాది జనవరి 31 కల్లా పూర్తవుతుందన్నారు. పోలా ఫార్మా స్థానిక నైపుణ్యం, సన్‌ ఫార్మా అంతర్జాతీయ పటిష్టతలు కలగలసి జపాన్‌లో మరింత వృద్ధిని సాధిస్తామని సన్‌ ఫార్మా జపాన్‌ హెడ్‌ జునిచి నకమిచి వ్యాఖ్యానించారు.  

పోలా ఫార్మా ఆదాయం 11 కోట్ల డాలర్లు.... 
పోలా ఫార్మా కంపెనీ జపాన్‌లో జనరిక్, బ్రాండెడ్‌ ఔషధాలకు సంబంధించి పరిశోధన, తయారీ, విక్రయం, మార్కెటింగ్‌  కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రధానంగా చర్మ సంబంధిత ఔషధాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీకి జపాన్‌లో రెండు ప్లాంట్లున్నాయి. గత ఏడాదిలో ఈ కంపెనీ 11 కోట్ల డాలర్ల ఆదాయాన్ని, 70 లక్షల డాలర్ల నికర నష్టాన్ని చవిచూసింది.  సన్‌ ఫార్మా కంపెనీ జపాన్‌ ఫార్మా మార్కెట్లోకి 2016లో ప్రవేశించింది. నొవార్టిస్‌కు చెందిన 14  ప్రిస్క్రిప్షన్‌ బ్రాండ్ల కొనుగోళ్ల ద్వారా సన్‌ ఫార్మా జపాన్‌ మార్కెట్లోకి అడుగిడింది. జపాన్‌ ఫార్మా మార్కెట్‌ 8,480 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా. 1.13 లక్ష కోట్ల డాలర్ల ప్రపంచ ఫార్మా మార్కెట్లో జపాన్‌ ఫార్మా మార్కెట్‌ వాటా 7.5 శాతంగా ఉంది. పోలా ఫార్మా టేకోవర్‌ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో సన్‌ ఫార్మా షేర్‌ 3 శాతం వరకూ నష్టపోయి రూ.511 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top