
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్, రుణ రేట్లను తగ్గించింది. తాజా రేట్లు నవంబర్ 10 నుంచీ అమల్లోకి వస్తాయి. శుక్రవారం బ్యాంక్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. దీనిప్రకారం...
►నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్) రుణ రేటు అన్ని కాలపరిమితులపై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గింది. బ్యాంక్ ఈ ఏడాది రుణరేటు తగ్గించడం ఇది వరుసగా ఏడవసారి.
►ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది కాల వ్యవధి రుణ రేటు 8 శాతానికి దిగి వచ్చింది.
►ఇక టర్మ్ డిపాజిట్ రేట్లనూ బ్యాంక్ తగ్గించింది. రెండేళ్ల వరకూ రిటైల్ టర్మ్ డిపాజిట్‌పై రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు అన్ని కాల వ్యవధులపై 30 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది.