గ్రామీణ డిమాండ్‌కు గడ్డు పరిస్థితి | situation is worse in rural demand | Sakshi
Sakshi News home page

గ్రామీణ డిమాండ్‌కు గడ్డు పరిస్థితి

Feb 3 2016 1:46 AM | Updated on Sep 3 2017 4:49 PM

గ్రామీణ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ)తన తాజా నివేదికలో పేర్కొంది.

♦ బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా
♦ వర్షాభావం ప్రభావం ఉంటుందని విశ్లేషణ


 న్యూఢిల్లీ: గ్రామీణ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ)తన తాజా నివేదికలో పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు, అంతర్జాతీయంగా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువగా ఉండడం వంటివి దీనికి ప్రధాన కారణంగా వివరించింది. గ్రామీణ డిమాండ్‌నుపునరుద్ధరించడమే ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఇందుకు స్వామినాథన్ ఫార్ములాను  క్రమంగా అమలు పరచాల్సి ఉంటుందనీ సూచించింది.

వరి, గోధుమలకు కనీస మద్దతు ధర వ్యయానికన్నా 50 శాతం అధికంగా ఉండాలని ఈ ఫార్ములా సూచిస్తోంది. 2017 వరకూ పెట్టుబడుల ఆధారితంగా ఆర్థిక వృద్ధి అవకాశాలు లేవని పేర్కొన్న బ్యాంక్, అప్పటి వరకూ ఆర్థిక వ్యవస్థకు వినియోగ ఆధారిత రికవరీనే మార్గమని వివరించింది. వేతన కమిషన్ సిఫారసుల అమలు, రేటు కోత, చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల గృహాల పొదుపురేట్లు పెరగడం వంటి అంశాలు 2016 మధ్యలో జీడీపీ విలువను ఒక శాతం మేర పెంచే వీలుందని వివరించింది. అయితే ఈ విషయంలో గ్రామీణ డిమాండ్ పెరుగుదలను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని వివరించింది.

 ద్రవ్యలోటు లక్ష్యం కష్టమే: యూబీఎస్
 ఇదిలావుండగా... వృద్ధి మందగమనం వల్ల ద్రవ్యలోటు లక్ష్యాల విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడే వీలుందని మరో గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం యూబీఎస్ అభిప్రాయపడింది. వేతన కమిషన్ సిఫారసుల అమలు, డిమాండ్‌ను పెంచాల్సిన అవసరం వంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలు పెరిగి ద్రవ్యలోటు అంచనాలు దాటే వీలుందని ఒక నివేదికలో విశ్లేషించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement