ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ద్రవ్యోల్బణం షాక్‌! అక్కడ డిమాండ్‌ ఢమాల్‌!

Volume growth for FMCG companies subdued higher prices sluggis​ rural demand says crisil - Sakshi

రెండేళ్లపాటు ఇదే పరిస్థితి  

అధిక ద్రవ్యోల్బణమే కారణం

కంపెనీల అంచనాలు  

ముంబై: ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు వ్యాపారంలో స్తబ్దతను చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ సన్నగిల్లడం, అధిక ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ ఆదాయాల్లో పెద్దగా వృద్ధి కనిపించదని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే పరిమితం కాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. 2022-23లో 7-9 శాతం మధ్య ఆదాయంలో వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాను వెల్లడించింది. (బడా టెక్‌ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు)

గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.5 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘రూ.4.7 లక్షల కోట్ల మొత్తం ఆదాయంలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం, తగ్గిన వేతనాలు, కరోనాతో ఉపాధి నష్టం పరిస్థితులు నెలకొన్నట్టు’’ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఎఫ్‌ఎంసీజీ రంగంపై ఓ నివేదికను విడుదల చేసింది. తయారీ వ్యయాలు పెరగడంతో, మార్జిన్లను కాపాడుకునేందుకు కరోనా అనంతరం విడతల వారీగా రేట్లను ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు పెంచాయి. దీని ప్రభావం కూడా వృద్ధిపై ఉన్నట్టు ఈ నివేదిక వివరించింది.  (టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్‌ న్యూస్‌)

ధరలు తగ్గితే అనుకూలం..   
ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం సైతం ఆదాయంలో వృద్ధి ఇప్పటి మాదిరే ఉండొచ్చని, ఒకవేళ ధరలు దిగొస్తే పరిస్థితి మెరుగుపడొచ్చన్నది  క్రిసిల్‌ విశ్లేషణ. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 1-1.5 శాతం తగ్గి 18-19 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాలు (గోధుమ, పాలు, మొక్కజొన్న, బియ్యం, చమురు), మార్కెటింగ్‌ వ్యయాలు అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇవి గత నాలుగైదు త్రైమాసికాలుగా పెంచిన ధరల అనుకూలతను తగ్గించినట్టు వివరించింది. ఇక వంట నూనెలు, చక్కెర ధరలు తగ్గినందున కొంత అనుకూలిస్తుందని పేర్కొంది. రూ.4.7 లక్షల కోట్ల ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో 35 శాతం వాటా కలిగిన 76 కంపెనీల వివరాలను క్రిసిల్‌  విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 0.50–0.70 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. 

ధరల ప్రభావం.. 
పట్టణ వినియోగంపై ద్రవ్యోల్బణం (రేట్ల పెరుగుదల) ప్రభావం తక్కువగానే ఉందని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేతి తెలిపారు. 2020-2021లో మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ స్తబ్ధుగానే ఉంటుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత్లాలో చిన్న ప్యాకెట్లకు డిమాండ్‌ పెరగడాన్ని క్రిసిల్‌ ప్రస్తావించింది. పంటలకు అధిక కనీస మద్దతు ధరలు, సాగు దిగుబడి మెరుగ్గా ఉండడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ వచ్చే ఆర్థిక సంత్సరంలో పుంజుకుంటుందని చెప్పడానికి సంకేతాలుగా తెలియజేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం పట్టణాల్లో డిమాండ్‌ స్థిరంగా ఉంటుందని క్రిసిల్‌ అంచనా వేసింది. ఇక ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరగొచ్చని పేర్కొంది. గృహ సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ అమ్మకాల్లో 6-8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top