చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్‌

Sharp Decline in Jio New Subscribers in December Due to Tariff Hike: TRAI - Sakshi

గత ఏడాది డిసెంబరులోభారీగా క్షీణించిన  జియో కొత్త చందాదారులు

బీఎస్‌ఎన్‌ఎల్‌కు పెరిగిన కొత్త చందాదారులు 

డిసెంబరులో 4,26,958  కొత్త చందారులు యాడ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఉచిత సేవలతో టెలికాం పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ జియోకు తాజాగా భారీ షాక్‌ తగిలింది. ఇటీవలి కాలవంలో టారిఫ్‌ సవరింపు కారణంగా డిసెంబరు నెలలో జియో కొత్త వినియోగదారుల సంఖ్యలో భారీగా క్షీణించిందని  ట్రాయ్‌ వెల్లడించింది. నవంబరు నెలలో 5లక్షల 60 వేల కొత్త చందారులను జత చేసుకున్న జియో డిసెంబర్ నెలలో 82,308 మంది ఖాతాదారులను మాత్రమే నమోదు చేసింది. అంతేకాదు ఈ విషయంలో  బీఎస్‌ఎన్‌ఎల్‌ కంటే వెనకపడటం విశేషం. మరోవైపు ఏజీఆర్‌ బకాయిలతో సంక్షోభంలో పడ్డ వొడాఫోన్‌ ఐడియా చందాదారుల విషయంలో కూడా  పురోగతి లేదు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డిసెంబర్ 31, 2019తో ముగిసిన నెలలో భారతీయ టెలికాం కంపెనీల చందాదారుల డేటాను బుధవారం విడుదల చేసింది.  జియో గత ఏడాది డిసెంబర్‌లో తన టారిఫ్ పెంపును ప్రవేశపెట్టడమే  సబ్‌ స్కై‍బర్ల  సంఖ్య తగ్గడానికి  ప్రధాన కారణం కావచ్చని పేర్కొంది. కంపెనీ మార్కెట్ వాటా పుంజుకుంది.  నవంబర్ 2019 చివరిలో 32.04 శాతంతో పోలిస్తే 32.14 శాతానికి పెరిగింది. వోడాఫోన్-ఐడియా మార్కెట్ వాటా నవంబర్‌లో 29.12 శాతం నుండి డిసెంబర్‌లో 28.89 శాతానికి తగ్గింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నెలలో సుమారు 4,26,958 మంది కొత్త చందాదారులను చేర్చుకుంది.  ఇది జియో కంటే ఎక్కువ.  నవంబర్ 2019 నెలలో 3,38,480 మంది  మాత్రమే.  దీని మార్కెట్ వాటా ఒక నెలలో 10.19 శాతం నుండి 10.26 శాతానికి పెరిగింది. 2 019 చివరి నెలలో ప్రవేశపెట్టిన సుంకం పెంపు కారణంగా  మొత్తం చందాదారుల వృద్ధి మందగమనంలో ఉందని ట్రాయ్‌ వెల్లడించింది.  అయినప్పటికీ రిలయన్స్ జియో ఇప్పటికీ మార్కెట్ వాటాలో 32.14 శాతంతో టాప్‌లో ఉండగా, వొడాఫోన్ ఐడియా 28.89 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంది. 28.43 శాతం మార్కెట్ వాటాతో   మూడవ స్థానంలో ఎయిర్‌ టెల్‌ వుంది.

తాజా ట్రాయ్‌ నివేదిక ప్రకారం వొడాఫోన్ ఐడియా డిసెంబర్ 31తో ముగిసిన నెలలో 36,44,453 మంది సభ్యులను కోల్పోయింది. ఇది నవంబర్ నెలలో కోల్పోయిన 3,64,19,365 కంటే చాలా తక్కువ. చందాదారుల సంఖ్యలో నష్టం గణనీయంగా  తగ్గినప్పటికీ, మార్కెట్ వాటా గత నెలలనుంచి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఎయిర్‌టెల్‌ డిసెంబర్ నెలలో చందాదారులను కోల్పోయినా  ఈ  సంఖ్య 11,050 వద్ద  స్థిరంగా ఉంది. మొత్తం వైర్‌లెస్ చందాదారుల సంఖ్య  2019 నవంబరులో 1,154.59 మిలియన్ల నుండి 2019 డిసెంబర్ చివరినాటికి 1,151.44 మిలియన్లకు తగ్గింది. తద్వారా నెలవారీ క్షీణత రేటు 0.27 శాతం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top