
నేడు (22న) దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 11,195 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 11,175 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లో కోవిడ్-19 మరింత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం ట్రిలియన్ డాలర్లతో మరో ప్యాకేజీ ప్రకటించవచ్చన్న అంచనాలు మంగళవారం యూఎస్ మార్కెట్లకు బలాన్నిచ్చాయి. దీంతో మార్కెట్లు 0.2-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత సానుకూలంగా ప్రారంభంకావచ్చని, తదుపరి ఆటుపోట్లు చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా నాలుగు రోజులపాటు మార్కెట్లు లాభాల బాటలో సాగడంతో కొంతమేర లాభాల స్వీకరణకు వీలున్నదని అంచనా వేస్తున్నారు.
వ్యాక్సిన్ హోప్
ప్రపంచదేశాలకు సమస్యలు సృష్టిస్తున్న కోవిడ్-19 కట్టడికి త్వరలో వ్యాక్సిన్ వెలువడగలదన్న అంచనాలతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సమయం గడిచేకొద్దీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మంగళవారం సెన్సెక్స్ 511 పాయింట్లు జంప్‌చేసింది. 38,000 పాయింట్ల సమీపంలో 37,930 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 37,990 వరకూఎగసింది. ఇక నిఫ్టీ 11,180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 140 పాయింట్లు జమ చేసుకుని 11,162 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే గరిష్టాలవద్దే మార్కెట్లు నిలవడం గమనార్హం!
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,124 పాయింట్ల వద్ద, తదుపరి 11,085 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,190 పాయింట్ల వద్ద, ఆపై 11,218 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,633 పాయింట్ల వద్ద, తదుపరి 22,483 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,897 పాయింట్ల వద్ద, తదుపరి 23,011 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐలు భళా..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2266 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 727 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1710 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.