కొత్త శిఖరాలకు సూచీలు

Sensex, Nifty rise to end at record closing highs - Sakshi

తుది దశలో అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందం 

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు 

పుంజుకున్న రూపాయి 

కొనసాగుతున్న విదేశీ కొనుగోళ్లు 

రికార్డ్‌ స్థాయిల్లో సూచీల ముగింపు

199 పాయింట్లతో 41,021కు సెన్సెక్స్‌

63 పాయింట్లు పెరిగి 12,101కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్లో రికార్డ్‌ల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డ్‌లను సృష్టించిన సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం ముగింపులో కొత్త శిఖరాలకు చేరాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, నవంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటంతో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కలసివచ్చాయి. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 199 పాయింట్లు పెరిగి 41,021 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 63 పాయింట్లు ఎగసి 12,101 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు. వీటితో పాటు బ్యాంక్‌ నిఫ్టీ కూడా 31,876 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలో ముగిసింది. బ్యాంక్, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ  షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, టెలికం, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు లాభాల స్వీకరణ కారణంగా నష్టపోయాయి.  

వాహన షేర్లకు ‘స్క్రాప్‌ పాలసీ’ లాభాలు  
ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలతో బ్యాంక్‌ షేర్లు పెరిగాయి. వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్‌ పాలసీ)  ప్రభుత్వం తీసుకు రానున్నదన్న  వార్తల కారణంగా వాహన, వాహన విడిభాగాల షేర్లు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారత్‌ ఫోర్జ్, అశోక్‌ లేలాండ్, మారుతీ సుజుకీ, ఐషర్‌ మోటార్స్, హీరో మోటొకార్ప్, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, బజాజ్‌ ఆటోలు 1–3 శాతం రేంజ్‌లో పెరిగాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా ఇదే జోరు చూపించాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 254 పాయింట్ల లాభంతో 41,076 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 12,115 పాయింట్లకు చేరాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్‌ హైల వద్ద ముగిసినప్పటికీ, వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అలహాబాద్‌ బ్యాంక్, చెన్నై పెట్రో, జైన్‌ ఇరిగేషన్, ఎంఫసిస్‌ తదితర షేర్లు  ఈ జాబితాలో ఉన్నాయి. పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరాయి. దివీస్‌ ల్యాబ్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, అదానీ గ్రీన్, పీఐ ఇండస్ట్రీస్‌  తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

► యస్‌ బ్యాంక్‌ 8 శాతం లాభంతో రూ. 68 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. నిధుల సమీకరణ నిమిత్తం ఈ నెల 29న బోర్డ్‌ సమావేశం జరగనున్నదన్న వార్తలు        దీనికి కారణం.  

► ఎస్‌బీఐకు చెందిన క్రెడిట్‌ కార్డ్‌ల విభాగం, ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించిన నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్‌ 2.4 శాతం లాభంతో రూ.344 వద్ద ముగిసింది.ఈ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ మళ్లీ రూ.3 లక్షల కోట్లకు ఎగబాకింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడ్డ రెండో షేర్‌  ఇదే.  

► ఎల్‌ అండ్‌ టీ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.1,335 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

రూ.8 పెరిగితే.. పది లక్షల కోట్లకు!
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 0.7 శాతం లాభంతో రూ.1,570 వద్ద ముగిసింది. మార్కెట్‌ క్యాప్‌ రూ.9.96 లక్షల కోట్లకు పెరిగింది. ఈ షేర్‌ రూ.8 పెరిగితే కంపెనీ  మార్కెట్‌ క్యాప్‌ రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది. భారత్‌లో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీ ఇదే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top