600 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ప్రారంభం

Sensex jumps 600 pts; SBI, RIL in focus - Sakshi

10300 పైన నిఫ్టీ ప్రారంభం

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు 

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 613 పాయింట్ల లాభంతో 34901 వద్ద, నిఫ్టీ 185 పాయింట్లు పెరిగి 10327 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌ను నడిపిస్తున్న బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 3.50శాతానికి పైగా 21,785.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా దాదాపు 75 రోజుల తర్వాత నేడు దేశవ్యాప్తంగా హోటల్స్‌, రెస్టారెంట్స్‌, షాపింగ్‌ మాల్స్‌తో పాటు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే స్థలాలు పునః ప్రారంభం కానుండటం ఈక్విటీ మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. మార్కెట్‌లోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. 

టైటాన్‌, పీవీఆర్‌, అబాట్‌ ఇండియా కంపెనీలతో పాటు 19 కంపెనీల త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొవిద్‌-19 కేసుల సంఖ్య 2.50లక్షలకు పైగా నమోదు కావడంతో స్టాక్‌ మార్కెట్‌ను కలవరపరుస్తుంది. 

గతవారంలో శుక్రవారం వెల్లడైన అమెరికా నిరుద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు అయ్యాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మరింత తొందరగా రికవరి కావచ్చని ఆశలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్నాయి. ఫలితంగా నేడు ఆసియాలో చైనా, జపాన్‌, సింగపూర్‌, తైవాన్‌, థాయిలాండ్‌, కొరియా, ఇండోనేషియా దేశాలకు చెందిన స్టాక్‌ సూచీలన్నీ 1శాతానికి పైగా లాభాల్లో కదులుతున్నాయి. అత్యధికంగా ఇండోనేషియా ఇండెక్స్‌ జకార్తా కాంపోసైట్‌ 2.50శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. 

రష్యాతో పాటు ఓపెక్ దేశాలు జూలై చివరి వరకు రికార్డు స్థాయిలో చమురు ఉత్పత్తి కోతను మరింత తగ్గించడానికి అంగీకరించడంతో క్రూడాయిల్‌ ధరలు 3నెలల గరిష్టంపై ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు బ్యారెల్‌ బ్రెండ్‌ క్రూడాయిల్‌ ధర 1.50శాతం లాభపడి 43డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుంది.

బజాజ్‌ ఫైనాన్స్‌, టాటామోటర్స్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 4.50శాతం నుంచి 7శాతం లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, సన్‌ఫార్మా, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top