రెండో రోజూ రికార్డు...

Sensex closes at all-time high of 39,056 on sustained FPI inflows - Sakshi

కొత్త ఆర్థిక సంవత్సరం.. రికార్డ్‌లతో బోణి

వరుసగా నాలుగో రోజూ లాభాలు..

ఇంట్రాడే, ముగింపులో కొత్త శిఖరాలకు సెన్సెక్స్‌

తొలిసారిగా 39,000 పాయింట్లపైకి సెన్సెక్స్‌

185 పాయింట్ల లాభంతో 39,057 వద్ద ముగింపు

44 పాయింట్లు పెరిగి 11,713కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించింది. నిఫ్టీ 11,700 పాయింట్లపైకి ఎగబాకింది. వాహన, ఐటీ, బ్యాంక్‌  షేర్ల దన్నుతో వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి.  అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు బలపడి 68.74 వద్ద ముగియడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌185 పాయింట్ల లాభంతో 39,057 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 11,713 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 39,000 పాయింట్లపైన ముగియడం ఇదే తొలిసారి, ఇక నిఫ్టీ 11,700 పాయింట్లపైకి చేరడం దాదాపు ఏడు నెలల తర్వాత ఇదే ప్రథమం. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 39,122 పాయింట్లను తాకింది. సెన్సెక్స్‌ మొదలై 40 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో కొత్త ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌లు సాధించడం విశేషం.

‘విదేశీ’ పెట్టుబడులతో స్థిరత్వం....
ఆర్‌బీఐ రేట్ల కోత అంచనాలకు తోడు కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే భావనతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా మన మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇది మన మార్కెట్‌కు స్థిరత్వాన్ని కల్పిస్తోందని వారంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తొలి పాలసీ నిమిత్తం ఆర్‌బీఐ మోనేటరీ పాలసీ కమిటీ(ఎమ్‌పీసీ) సమావేశం మంగళవారం ఆరంభమైంది. రెపోరేటును పావు శాతం మేర ఆర్‌బీఐ తగ్గిస్తుందన్న అంచనాలున్నాయి. రేట్ల నిర్ణయం రేపు(గురువారం) వెలువడుతుంది.

తొలగిన అంతర్జాతీయ వృద్ధి అనిశ్చితి....
అమెరికా, చైనాల్లో తయారీ రంగ గణాంకాలు అంచనాలను మించాయి. దీంతో అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి తొలగిపోయింది. ఫలితంగా సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా, మంగళవారం ఆసియా, యూరప్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ఇది మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆ తర్వాత ఒడిదుడుకులకు గురైనా,  ఇంట్రాడే, ముగింపులో జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్‌లను సాధించింది.

సెన్సెక్స్‌  @ 40 సంవత్సరాలు
సెన్సెక్స్‌ మొదలై 40 ఏళ్లు పూర్తయింది. వాస్తవానికి 1986, జనవరి 2న సెన్సెక్స్‌ మొదలైంది. అయితే సెన్సెక్స్‌కు ఆధార(బేస్‌) తేదీగా 1979, ఏప్రిల్‌ 1ని తీసుకోవడంతో సోమవారంతో సెన్సెక్స్‌కు  40 వసంతాలు పూర్తయినట్లు లెక్క. 1979, ఏప్రిల్‌ 1న వంద పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్‌ 40 ఏళ్ల తర్వాత 39,000 పాయింట్లపైకి ఎగబాకింది. డివిడెండ్లను కూడా లెక్కలోకి తీసుకుంటే సెన్సెక్స్‌ 56,000 పాయింట్లకు చేరినట్లు లెక్క అని బీఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ ఆశీష్‌ కుమార్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

మొత్తం మీద సెన్సెక్స్‌ 16 శాతం చక్రగతి వృద్ధిని సాధించింది. మరింత    విపులంగా చెప్పాలంటే 1979, ఏప్రిల్‌ 1న రూ. లక్ష ఇన్వెస్ట్‌ చేస్తే, ఈ 40 ఏళ్లలో దాని విలువ రూ.5.6 కోట్లకు చేరుతుంది. ఇదే కాలంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పుత్తడి, రియల్‌ ఎస్టేట్‌ తదితర ఆస్తులు 7–12 శాతం చక్రగతి రాబడులనిచ్చాయి.  సెన్సిటివ్‌ ఇండెక్స్‌లో మొదటి రెండు పదాలు, చివరి పదం కలయికగా సెన్సెక్స్‌ పదాన్ని మొదటిసారిగా దీపక్‌ మోహొని అనే స్టాక్‌ మార్కెట్‌ ఎనలిస్ట్‌ వాడారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సెన్సెక్స్‌లో ఆరు షేర్లు అలాగే కొనసాగుతున్నాయి. ఈ షేర్లు– ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్‌.  

ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌లు..
సూచీ    ఇంట్రాడే    క్లోజింగ్‌
సెన్సెక్స్‌    39,122    39,057


 సెన్సెక్స్‌ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లు సృష్టించడం గర్వకారణంగా ఉంది.
      – బీఎస్‌ఈ సీఈఓ అశీష్‌ కుమార్‌ చౌహాన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top