క్రమం తప్పకుండా ఆదాయం

Senior Citizens Savings Scheme 2020 best plans - Sakshi

ఆశించే రాబడి, రిస్క్‌ కొలమానాలు

వీటి ఆధారంగానే ఎంపిక

ఎఫ్‌డీలు, యాన్యుటీ ప్లాన్లు, ఎస్‌డబ్ల్యూపీలు

ఎస్‌సీఎస్‌ఎస్, వయవందన యోజన పథకాలు

కాల వ్యవధి, రాబడి వేర్వేరు

పదవీ విరమణ చేసిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోసం కచ్చితంగా ఒక ఏర్పాటు అనేది ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ ప్రయోజనాలు ఉంటాయి. ప్రైవేటు రంగంలోని వారికి సైతం పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ కోసం ఈపీఎఫ్‌వో అందించే ఎంప్లాయీ పెన్షన్‌ స్కీమ్‌ ఒకటి ఉంది. కానీ, దీనిపై వచ్చే పెన్షన్‌ చాలా తక్కువ. కనుక ప్రైవేటు రంగంలోని వారు, స్వయం ఉపాధిలో ఉన్న వారు పదవీ విరమణ అనంతరం క్రమం తప్పకుండా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. వీరికోసం అందుబాటులో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌తోపాటు.. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవడం (ఎస్‌డబ్ల్యూపీ) ఇలా ఎన్నో. అయితే, అందరికీ అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. కనుక ఈ సాధనాలు, వాటిల్లో రాబడులు, రిస్క్‌ ఏ మేరకు తదితర వివరాలను తెలియజేసే ప్రాఫిట్‌ కథనం ఇది..

తమ పెట్టుబడులు, రాబడులపై ఎటువంటి రిస్క్‌ వద్దనుకునే వారు పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాన్ని (పీవోఎంఐఎస్‌) పరిశీలించొచ్చు. అన్ని వయసుల వారు ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి వయవందన యోజన, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ వంటివి 60 ఏళ్లు నిండిన వారికి మాత్రమే. కానీ, ఇవన్నీ సురక్షిత సాధనాలు. మూడు నెలలకోసారి అయినా ఫర్వాలేదనుకుంటే అందుకు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ఈ మూడింటిలో అధిక రాబడులను ఇచ్చే సాధనం. పోస్టాఫీసు ఎంఐఎస్‌ పథకంలో ప్రస్తుతం పెట్టుబడులపై 7.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షలు, అదే జాయింట్‌గా అయితే రూ.9 లక్షల వరకే ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అనుమతి ఉంది. దీని కాల వ్యవధి ఐదేళ్లు. ఏడాది పూర్తయిన తర్వాత ముందస్తుగా వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. కాకపోతే పెట్టుబడిలో 2 శాతాన్ని తపాలా శాఖ మినహాయించుకుంటుంది. అదే మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటే అప్పుడు ఒక్క శాతమే కోల్పోవాల్సి వస్తుంది. పీవోఎంఐఎస్‌ పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం ఆ వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఇతర ఆదాయ మార్గంలో దీన్ని         చూపించి అవసరమైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  

వయవందన యోజన
ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పెట్టుబడి సాధనం. ఇందులో ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. కాల వ్యవధి పదేళ్లు. కనీసం రూ.1.5 లక్షలు, గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఒక వ్యక్తి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పీఎంవీవీవై ద్వారా వచ్చే వడ్డీ ఆదాయాన్ని కూడా వార్షిక ఆదాయ రిటర్నుల్లో ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) పథకంలో పెట్టుబడులను సెక్షన్‌ 80సీ కింద చూపించుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.6 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. లేదా రిటైర్మెంట్‌ సమయంలో వచ్చిన మొత్తాన్ని.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకే ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అనుమతిస్తారు. 60 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఇందులో పెట్టుబడులకు అర్హులు. అదే ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారు (55–60 ఏళ్ల మధ్య) ఒక నెల వ్యవధి మించకుండా ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ప్రతీ త్రైమాసికం చివర్లో.. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెల చివరి తేదీన వడ్డీ చెల్లింపులు చేస్తారు.  

యాన్యుటీ  ప్లాన్లు
బీమా కంపెనీలు ఆఫర్‌ చేసే ఇమీడియట్‌ యాన్యుటీ పథకాలు కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనం. వీటిల్లోనూ రిస్క్‌ తక్కువే. మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తంపై, మరుసటి నెల నుంచే పెన్షన్‌ అందుకోవచ్చు. కాకపోతే వీటిల్లో పెట్టుబడులపై రాబడులు తక్కువగా ఉంటాయి. వీటిల్లో గరిష్ట రాబడి రేటు కేవలం 6 శాతమే. వీటిపై వచ్చే ఆదాయాన్ని ఇతర మార్గాల కింద వచ్చిన ఆదాయంగా ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటిలోకి రాబడులు ఎస్‌సీఎస్‌ఎస్‌లోనే ఎక్కువ అని చెప్పుకోవాలి. కాకపోతే గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలు. పైగా మూడు నెలలకోసారి మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. మొదటి మూడు నెలలకు సరిపడా నిధి మీ వద్ద ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ఎస్‌సీఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుంటే, ఈ పథకంలో పెట్టుబడులు సౌకర్యంగా, రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఇది అనుకూలంగా లేదనుకున్న వారు వయవందన యోజనను పరిశీలించొచ్చు. అలాగే, ఒక పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితికి మించి ఇంకా నిధి మిగిలి ఉంటే అప్పుడు మరో పథకాన్ని ఎంచుకోవచ్చు.   

ఫిక్స్‌డ్‌  డిపాజిట్లు
రిస్క్‌ కొంచెం తక్కువ కోరుకునే వారి కోసం బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా ఉన్నాయి. కాకపోతే జాతీయ బ్యాంకుల్లో అయితే దీర్ఘకాలానికి వడ్డీ రేటు 7 శాతం వరకే ఉంది. ఒకవేళ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు ఆసక్తిగా ఉంటే 7–9 శాతం మధ్య వడ్డీ రాబడి పొందొచ్చు. సాధారణంగా బ్యాంకులు త్రైమాసికం వారీగా వడ్డీ చెల్లింపులు చేస్తాయి. అయితే, డిపాజిటర్‌ కోరితే నెలవారీగా చెల్లింపులు చేసే బ్యాంకులు కూడా ఉన్నాయి. కాకపోతే నెలవారీగా కోరుకుంటే వచ్చే ఆదాయం కాస్త తగ్గుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మంత్లీ ఇన్‌కమ్‌ ఆప్షన్‌ అనే పథకాన్ని నిర్వహిస్తోంది. సాధారణ ఎఫ్‌డీతో పోలిస్తే ఇది భిన్నమైనది. ఇందులో పెట్టుబడి కాల వ్యవధి తర్వాత చెల్లింపుల కాలవ్యవధి ఆరంభమవుతుంది. అంటే 24 నెలల పాటు పెట్టుబడి కాల వ్యవధిని ఎంచుకున్నారనుకంటే... ఆ తర్వాత, తదుపరి 24 నెలల పాటు చెల్లింపులు జరుగుతాయి. వడ్డీ రేటు 7.25 శాతం. చెల్లింపుల సమయంలో ప్రతి నెలా చెల్లింపులు చేయగా మిగిలిన మొత్తంపై వడ్డీ కలుస్తూ ఉంటుంది.  

ఎన్‌బీఎఫ్‌సీ  డిపాజిట్లు
అధిక రిస్క్‌ తీసుకునే వారు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆఫర్‌ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పరిశీలించొచ్చు. కాకపోతే మంచి క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న వాటినే పరిశీలించడం మంచిది. బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీలు అధిక రేటును ఆఫర్‌ చేస్తాయి. అందుకే రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏఏఏ రేటింగ్‌ కలిగిన బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రస్తుతం 7.72 నుంచి 8.05 శాతం వరకు వార్షిక వడ్డీని నెలవారీగా చెల్లింపులపై ఆఫర్‌ చేస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే ఆదాయాన్ని ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు 60 ఏళ్లు నిండిన వారు మినహాయింపు పొందొచ్చు.

సిస్టమ్యాటిక్‌  విత్‌డ్రాయల్‌ ప్లాన్‌
మార్కెట్‌ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ)ను పరిశీలించొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసే సాధనం (సిప్‌)కు ఇది పూర్తి వ్యతిరేకం. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల నుంచి క్రమం తప్పకుండా ఇంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేదానిని ఎస్‌డబ్ల్యూపీగా పేర్కొంటారు. తన మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల నుంచి ప్రతీ నెలా ఇంత మొత్తం కావాలని ఏఎంసీకి ఇన్‌స్ట్రక్షన్‌ ఇస్తే చాలు. మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ మీ రిస్క్‌ను బట్టి, పూర్తిగా డెట్‌ లేదా ఈక్విటీ లేదా ఈక్విటీ డెట్‌ కలయికతో కూడిన ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్‌ చేసిన మరుసటి నెల నుంచే తీసుకుంటే మొదటి ఏడాది వరకు ఎగ్జిట్‌లోడ్‌ను భరించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఇది ఒక శాతంగా ఉండొచ్చు. పైగా ఎస్‌డబ్ల్యూపీపై ప్రతి నెలా వెనక్కి తీసుకునే మొత్తంపై లాభం ఆర్జిస్తే, అది మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. ఈక్విటీ పథకాలు అయితే స్వల్పకాల మూలధన లాభాలు (ఏడాదిలోపు)పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి మించిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం.. మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించి ఉంటే ఆ మొత్తంపైనే 10 శాతం పన్ను అమలవుతుంది. ఈక్విటీ కాకుండా ఇతర పథకాలు అయినా మూడేళ్లకు మించి కొనసాగించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 20 శాతం వర్తిస్తుంది. మూడేళ్ల లోపు కాలంలో వచ్చే లాభాలను వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top