మినిమమ్‌ బ్యాలెన్స్‌లపై ఎస్‌బీఐ ప్రకటన

SBI Says Nearly 40% Of Savings Accounts Exempted From Minimum Balance Rules - Sakshi

న్యూఢిల్లీ : ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారుల నుంచి బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల మేర జరిమానాను వసూలు చేశాయని వస్తున్న వార్తలపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. నెలవారీ నిర్వహించే కనీసం బ్యాలెన్స్‌లను ఏప్రిల్‌ నుంచి తాము 40 శాతం తగ్గించామని పేర్కొంది. అంతేకాక 40 శాతం సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లను ఈ నిబంధనల నుంచి మినహాయించామని వెల్లడించింది. కనీస బ్యాలెన్స్‌ నిర్వహించలేకపోవడంపై విధించే ఛార్జీలు, ఇండస్ట్రీలోనే తమవే అత్యంత తక్కువగా ఉన్నాయని చెప్పింది. ఎస్‌బీఐ భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వస్తున్న రిపోర్టులపై బ్యాంక్‌ ఈ ప్రకటన చేసింది. ఎస్‌బీఐ ఆ నిబంధనల కింద నాలుగు కేటగిరీల్లో బ్రాంచులను క్లాసిఫై చేసింది. రూరల్‌, సెమీ-అర్బన్‌, అర్బన్‌, మెట్రో. బ్రాంచు ఉండే ప్రాంతం బట్టి సగటు నెలవారీ నిల్వలు బ్యాంక్‌ అకౌంట్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ కస్టమర్‌ కనుక ఈ నిల్వలను నిర్వహించలేని పక్షంలో, జరిమానాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. 

ఎస్‌బీఐ బ్రాంచ్‌ టైప్‌               సగటు నెలవారీ నిల్వలు
మెట్రో                                  రూ.3000
అర్బన్‌                                 రూ.3000
సెమీ-అర్బన్‌                          రూ.2000
రూరల్‌                                 రూ.1000

2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు వినియోగదారుల నుంచి రూ.5 వేల కోట్లను జరిమానా పేరిట వసూలు చేశాయని బ్యాంకింగ్‌ డేటాలో వెల్లడైంది. వీటిలో ఎస్‌బీఐ జరిమానాల పేరిట అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఎస్‌బీఐ కొన్ని సేవింగ్స్‌ అకౌంట్లను ఈ సగటు నెలవారీ మొత్తాల నిబంధల నుంచి మినహాయించింది. వాటిలో ప్రభుత్వ ఫైనాన్సియల్‌ ఇంక్లూజన్‌ స్కీన్‌ జన్‌ ధన్‌ యోజన, బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌, పీఎంజేడీఐ/బీఎస్‌బీడీ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లు, పెన్షనర్లు, మైనర్లు, సోషల్‌ సెక్యురిటీ బెనిఫిట్‌ హోల్డర్స్‌ అకౌంట్లు ఈ నిబంధన నుంచి మినహాయింపు పొందుతున్నాయి. ఈ అకౌంట్ల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని ఎస్‌బీఐ ప్రకటించింది. మొత్తం 42.5 కోట్ల సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లలో సుమారు 40 శాతం అకౌంట్లను కనీస బ్యాలెన్స్‌ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాక కస్టమర్లు ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి బీఎస్‌బీడీ అకౌంట్లలోకి మారడానికి ఎలాంటి ఛార్జీలను వేయడం లేదని తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top