ఎస్‌బీఐ లాభం 838 కోట్లు

SBI reports Q4 profit of Rs 838 crore; asset quality improves - Sakshi

తగ్గిన మొండి భారం  

మెరుగైన రుణ నాణ్యత

 రానున్నవి మంచి రోజులే  

ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ 

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.838 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ వ్యయాలు కూడా ఒక శాతం తగ్గడంతో ఈ స్థాయిలో నికర లాభం వచ్చిందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే క్వార్టర్‌లో రూ.7,719 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించారు.  మొత్తం ఆదాయం రూ.68,436 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.75,671 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్‌ 2.95 శాతంగా నమోదైందని వివరించారు. రానున్నదంతా మంచి కాలమేనన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. లాభాల్లో నడుస్తున్న తమ అనుబంధ కంపెనీలు,  ఎస్‌బీఐ కార్డ్, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లను త్వరలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేస్తామని చెప్పారు.
 
ఏడాది లాభం రూ.6,547 కోట్లు... 
ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2017–18లో రూ.6,547 కోట్ల  నికర నష్టాలు రాగా(స్టాండ్‌అలోన్‌), గత ఆర్థిక సంవత్సరంలో రూ.862 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) వచ్చిందని రజనీశ్‌ చెప్పారు. కీలకమైన కొన్ని ఒత్తిడి ఖాతాలకు వంద శాతం కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని వివరించారు.  కన్సాలిడేటెడ్‌ పరంగా చూస్తే,  2017–18లో రూ.4,187 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,069 కోట్ల నికర లాభం వచ్చిందని చెప్పారు. ఆదాయం రూ.3.01 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రుణాల వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నా, దేశీయ రుణాలు 14 శాతం పెరగడంతో మొత్తం రుణ వృద్ధి 12 శాతంగా నమోదైందని తెలిపారు.  

మెరుగుపడిన రుణ నాణ్యత 
ఎస్‌బీఐ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి నాటికి 10.91 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చినాటికి 7.53 శాతానికి తగ్గాయని రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 5.73 శాతం నుంచి 3.01 శాతానికి పడిపోయాయని పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.2,23,427 కోట్ల నుంచి రూ.1,72,750 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.1,10,855 కోట్ల నుంచి రూ.65,895 కోట్లకు తగ్గాయని తెలిపారు.  గత ఆర్థిక సంవత్సరంలో రూ.37,000 కోట్ల రికవరీ జరిగిందని, బ్యాంక్‌ చరిత్రలో ఇదే అత్యధికమని చెప్పారు. తాజా మొండి బకాయిలు గత క్యూ4లో రూ.7,505 కోట్లకు, గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.32,738 కోట్లకు చేరాయని తెలిపారు. తాజా మొండి బకాయిలు తక్కువగా ఉండటం, రికవరీలు పెరగడం, కేటాయింపులు పెరగడం వల్ల స్థూల, నికర మొండి బకాయిలు తగ్గాయని వివరించారు.  

79 శాతానికి పీసీఆర్‌.. 
ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 12.6 శాతం పెరిగి 79 శాతానికి చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే 4.1 శాతం మెరుగుపడింది. ఎస్సార్‌ స్టీల్, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్, అలోక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీల దివాలా ప్రక్రియ తుది దశలో ఉందని, వీటికి సంబంధించిన రూ.16,000 కోట్ల బకాయిలు వసూలు కాగలవని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రూ.3,487 కోట్ల రుణాలిచ్చామని, వీటిల్లో 1,125 కోట్ల రుణాలు మొండి పద్దులుగా మారాయని వివరించారు. కాగా మార్చి చివరి నాటికి బ్యాంక్‌ టైర్‌ వన్‌ మూలధనం 9.62 శాతంగానే ఉంది. దీంతో క్యూఐపీ విధానంలో ఈ బ్యాంక్‌ నిధులు సమీకరించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు.  ఆర్థిక ఫలితాలు బావుండటంతో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్‌ 3 శాతం ఎగసి రూ.308 వద్ద   ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.   

స్వల్పంగా తగ్గిన ఎస్‌బీఐ రుణ రేటు 
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) స్వల్పంగా తగ్గింది. ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన అన్ని కాలపరిమితుల రుణాలపై ఐదు బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) రుణ రేటు తగ్గినట్లు ఎస్‌బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. తక్షణం తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది.  ముఖ్యాంశాలు చూస్తే... 
►ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.5 శాతం నుంచి8.45 శాతానికి తగ్గింది.  
► గడచిన నెల రోజుల్లో ఎస్‌బీఐ రుణ రేటును తగ్గించడం ఇది రెండవసారి. ఆర్‌బీఐ పాలసీ రేటు ఏప్రిల్‌లో తగ్గించిన తరువాత, వెంటనే ఈ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐదు బేసిస్‌ పాయింట్ల రుణ రేటును తగ్గించింది.  
►ఏప్రిల్‌ 10 నుంచి గృహ రుణ రేట్లు 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు బ్యాంక్‌ ప్రకటన పేర్కొంది. ఆర్‌బీఐ పాలసీ రేట్ల ప్రయోజనాన్ని మరింతగా కస్టమర్లకు అందించడంలో భాగంగా మే 1వ తేదీ నుంచి లక్షపైన క్యాష్‌ క్రెడిట్, ఓవర్‌ డ్రాఫ్ట్‌ వడ్డీరేట్లను రెపోరేటుకు అనుసంధానించడం జరిగిందని ఎస్‌బీఐ పేర్కొంది.  

అంతా శుభమే

అన్ని అంశాల్లో మంచి పనితీరు కనబరిచాం. టర్న్‌ అరౌండ్‌ సాధించాం. రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల, నికర మొండి బకాయిలు తగ్గాయి. భవిష్యత్తులో ఎలాంటి భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అంతా శుభమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం రుణ వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.  
 రజనీష్‌ కుమార్,  ఎస్‌బీఐ చైర్మన్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top