Sakshi News home page

ఎస్‌బీఐ ఫాలో ఆన్ ఆఫర్ త్వరలో?

Published Wed, Jan 28 2015 1:25 AM

ఎస్‌బీఐ ఫాలో ఆన్ ఆఫర్ త్వరలో?

రూ.15,000 కోట్ల సేకరణపై దృష్టి
ముంబై: వ్యాపార విస్తరణకు కావలసిన మూల ధన సేకరణపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.15,000 కోట్లు సమీకరించడానికి బోర్డు ఆమోదించింది. ఇదే విషయాన్ని ఎస్‌బీఐ మంగళవారం ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ అదనపు మూలధనాన్ని సమీకరించడానికి ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు (ఎఫ్‌పీఓ) రావటం, లేదా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ చేయటం, ఇవి కాని పక్షంలో రైట్స్, క్విప్ ఇష్యూలు చేయటం వంటి మార్గాలను పరిశీలిస్తున్నట్లు బ్యాంకు తెలియజేసింది.
 
గతేడాది జనవరిలో ఎస్‌బీఐ రూ.8,032 కోట్లు సమీకరించించి. ఈ ఇష్యూకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) నుంచి అంతగా స్పందన లేకపోవడంతో ఇష్యూలో 40 శాతాన్ని దేశీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ సబ్‌స్క్రైబ్ చేసింది. కానీ ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారాయి.  ఎఫ్‌ఐఐలు పెద్ద ఎత్తున సెంకడరీ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తుండటంతో ఈసారి ఇష్యూకి పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా.

ప్రస్తుతం ఎస్‌బీఐలో ప్రభుత్వ వాటా 58.6%. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52% వరకు తగ్గించుకోవడానికి అనుమతిస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత వస్తున్న మొదటి ఇష్యూ ఇదే. 2018-19 నాటికి దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకులు బాసెల్-3 నిబంధనలను చేరుకోవడానికి రూ.1.5-2.2 లక్షల కోట్ల మూలధనం అవసరమవుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది.

Advertisement

What’s your opinion

Advertisement