పెట్టుబడుల్లో బ్యాలన్స్‌...

SBI Equity Hybrid Fund-Growth - Sakshi

ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌

మార్కెట్‌ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్‌ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్‌డీలు,  పోస్టాఫీసు పథకాల కంటే కాస్త అధికరాబడులు కోరుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో ఎస్‌బీఐ హైబ్రిడ్‌ ఈక్విటీ కూడా ఒకటి. గతంలో ఇది ఎస్‌బీఐ మ్యాగ్నం ఫండ్‌ పేరుతో నడిచింది. గతేడాదే సెబీ ఆదేశాల మేరకు పథకం పేరు మారింది. ఈ పథకం ఈక్విటీ, డెట్‌ రెండింటిలోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. కానీ, డెట్‌ సాధనాలకు మించి రాబడులను ఇవ్వగలదు. కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్‌ మార్కెట్లో, బేర్‌ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.   

రాబడులు
ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో మైనస్‌ 2 శాతంగా ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 10.46 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 15.39 శాతం, పదేళ్ల కాలంలో 16.19 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. 1995 డిసెంబర్‌ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.84 శాతంగా ఉన్నాయి. కనుక దీర్ఘకాలంలో ఓ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఈ స్థాయి రాబడులు మెరుగైనవేనని చెప్పుకోవాలి. రిస్క్‌ ఎక్కువగా తీసుకోలేని వారికి ఈ తరహా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ అనుకూలం.  

పెట్టుబడుల విధానం
పెట్టుబడుల కేటాయింపును ఈ పథకం మేనేజర్లు తెలివిగా చేస్తుంటారు. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటారు. 2011 మార్కెట్‌ కరెక్షన్‌లో, 2015 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్‌పోజర్‌ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్‌ మార్కెట్‌ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. 2018 మార్కెట్ల అస్థిరతల్లోనూ ఈక్విటీలో అధిక పెట్టుబడులను కాస్త తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేయడం, లాభాలను ఒడిసిపట్టడం ఈ ఫండ్‌ మేనేజర్లు చేసే పని.

ప్రస్తుతానికి ఈక్విటీల్లో 71.95 శాతం, డెట్‌లో 25.76 శాతం, నగదు నిల్వలు రూ.2.29 శాతం కలిగి ఉంది. ఈ పథకం ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 58 స్టాక్స్‌ ఉన్నాయి. మూడు రంగాల కంపెనీల్లోనే 44 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు 27 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత సేవల రంగానికి 9 శాతం వరకు కేటాయింపులు ఉన్నాయి. ఎనర్జీ, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌ రంగాలకు సుమారు ఐదు శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. ఈ పథకంలో కనీసం రూ.1,000 మొత్తంతో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ప్రతీ నెలా సిప్‌ రూపంలో అయితే రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంది.  

టాప్‌ హోల్డింగ్స్‌
అంశం                         పెట్టుబడుల శాతం
హెచ్‌డీఎఫ్‌సీ                    5.85
ఎస్‌బీఐ                          4.55
కోటక్‌ బ్యాంకు                  3.95
బీపీసీఎల్‌                       2.99
ఆర్‌ఐఎల్‌                       2.74
ఇన్ఫోసిస్‌                       2.53
దివిస్‌ ల్యాబ్స్‌                  2.43
ఐసీఐసీఐ బ్యాంకు            2.39
ఐటీసీ                           2.36
భారతీ ఎయిర్‌టెల్‌           2.29  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top