ఐపీఓకు సౌదీ ఆరామ్‌కో

Saudi Arabia Kick Starts IPO Of Worlds Largest Oil Company - Sakshi

లాంఛనంగా ప్రకటించిన కంపెనీ 

డిసెంబర్‌లో స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌  

దహ్రన్‌(సౌదీ అరేబియా): సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కో కంపెనీ ఐపీఓ (ఇనీశీయల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వివరాలను ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈ కంపెనీ 2016లోనే ఐపీఓకు వచ్చే ప్రయత్నాలు చేసింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఐపీఓ ఎట్టకేలకు సాకారమవుతోంది.  బుక్‌ బిల్డింగ్‌ విధానంలో షేర్లను జారీ చేస్తామని,  కంపెనీ చైర్మన్‌  యాసిర్‌ అల్‌–రుమయ్యన్‌ ఆదివారం వెల్లడించారు. ఆఫర్‌ ధరను, ఎన్ని షేర్లను విక్రయించేది ఈ బుక్‌ బిల్డింగ్‌ పీరియడ్‌ చివర్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఈ ఐపీఓకు సంస్థాగత ఇన్వెస్టర్లు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. సౌదీ వాసులు, సౌదీ అరేబియాలో నివాసం ఉంటున్న విదేశీయులు, ఇతర గల్ఫ్‌ వాసులు కూడా దరఖాస్తు చేయవచ్చని వివరించారు. ఈ నెల 9న ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనున్నది. సౌదీ ఆరామ్‌కో షేర్ల ట్రేడింగ్‌  సౌదీ  స్టాక్‌ ఎక్సే్చంజ్‌(తాదావుల్‌)లో వచ్చే నెల(బహుశా డిసెంబర్‌ 11న) మొదలు కావచ్చని అంచనా.  

ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ!  
ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ బహుశా ఇదే కానున్నది. ఎంత వాటాను ఈ కంపెనీ విక్రయించనున్నదో అనే నిర్ణయాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. విశ్లేషకులైతే ఈ కంపెనీ విలువను 1.7–1.5  లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. 1% వాటా విక్రయిస్తే, ఐపీఓ సైజు సుమారుగా 1,500 కోట్ల డాలర్లు అవుతుందని, ప్రపంచంలోనే 11వ అతి పెద్ద ఐపీఓ అవుతుందని అంచనా. ఒకవేళ 2 శాతం వాటా విక్రయిస్తే, ఇష్యూ సైజు 3,000 కోట్ల డాలర్ల అవుతుందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ ఇదే అవుతుందని అంచనా.

ప్రపంచంలో అతి పెద్ద ఐపీఓ రికార్డ్‌ ఇప్పటిదాకా అలీబాబా కంపెనీ(2,500 కోట్ల డాలర్లు) పేరిట ఉంది. కాగా, ప్రస్తుతానికి విదేశీ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో లిస్టింగ్‌ ఆలోచనను సౌదీ ఆరామ్‌కో పక్కనపెట్టింది. కాగా మన దేశంలో ఇప్పటివరకూ వచ్చిన అతి పెద్ద ఐపీఓ కోల్‌ ఇండియాదే (రూ.15,100 కోట్లు–సుమారుగా 200 కోట్ల డాలర్లు)

11,110 కోట్ల డాలర్ల నికర లాభం...
గత ఏడాదిలో సౌదీ ఆరామ్‌కో కంపెనీకి 11,110 కోట్ల డాలర్ల నికర లాభం వచ్చింది. ఇది దిగ్గజ కంపెనీలు–యాపిల్, గూగుల్, ఎక్సాన్‌ మొబిల్‌ కంపెనీల మొత్తం నికర లాభం కంటే కూడా ఎక్కువే కావడం విశేషం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top