టీవీల ఉత్పత్తిని ఆపివేస్తున్న శాంసంగ్‌

Samsung Now Plans To Stop TV Manufacturing In India - Sakshi

చెన్నై : ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ ఇటీవలే నోయిడాలో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌ను ఆవిష్కరించిన కొన్ని నెలల్లోనే శాంసంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో టీవీల ఉత్పత్తిని ఆపివేయాలని శాంసంగ్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చెన్నైలో ఉన్న తన ఒకేఒక్క టీవీల ఉత్పత్తి సౌకర్యాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని శాంసంగ్‌ ప్రణాళికలు రచిస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. దీంతో వియత్నాం నుంచి టీవీలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాలని యోచిస్తోందని రిపోర్టులు తెలిపాయి. వియత్నాంలో ఉన్న టీవీల ఉత్పత్తి సౌకర్యం శాంసంగ్‌ అత్యంత పెద్ద ప్రొడక్షన్‌ హబ్‌. ఈ విషయంపై ఇప్పటికే కంపెనీ స్థానికంగా ఉన్న సప్లయర్స్‌ను అలర్ట్‌ చేసినట్టు తెలిసింది. చెన్నైలో ఉన్న టీవీల తయారీ ప్లాంట్‌ ఏడాదికి 3 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసేది.

అయితే శాంసంగ్‌ అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీ ప్లాంట్‌ను మన దేశంలో ఏర్పాటు చేయడంతో, మేకిన్‌ ఇండియాకు బిగ్‌ బూస్ట్‌ వచ్చింది. కానీ కొన్ని నెలల్లోనే శాంసంగ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుని, మేకిన్‌ ఇండియాకు షాకిచ్చింది. టీవీ ప్యానల్స్‌ను తయారు చేయడంలో ఉపయోగపడే పరికరాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం విధించడంతో, శాంసంగ్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. అయితే టీవీల ఉత్పత్తిని శాంసంగ్‌ ఆపివేస్తుందని వస్తున్న రిపోర్టులపై ఆ కంపెనీ ప్రతినిధి స్పందించారు. దేశీయంగా తయారు చేసేందుకే తాము కట్టుబడి ఉన్నామని, టీవీల యూనిట్ల ప్రొడక్షన్‌ను తరలించే ప్లాన్లపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top