పాతదే.. అయినా కొత్తగా! | Sale of older cars beyond | Sakshi
Sakshi News home page

పాతదే.. అయినా కొత్తగా!

Jan 9 2018 12:56 AM | Updated on Jan 9 2018 12:56 AM

Sale of older cars beyond - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  రోజుకో కొత్త మోడల్‌ కారు.. ఆకట్టుకునే టెక్నాలజీ.. అబ్బురపరిచే డిజైన్‌.. ఇలాంటివి చూస్తే సహజంగానే కుర్రకారు ఏం చేస్తారు? తమ చేతుల్లోకీ ఆ కారు రావాలని కోరుకుంటారు. ఈ కారణంగానే తక్కువ కాలం వినియోగానికే కార్లు చేతులు మారుతున్నాయి. ఈ ట్రెండ్‌ కొత్తగా కారు కొనేవారికి కలిసివస్తోంది. ఎంచక్కా తక్కువ ధరకే కారును సొంతం చేసుకుంటున్నారు. కొత్త కార్లు ఏటా 30 లక్షల యూనిట్లు రోడ్డెక్కితే, పాతవి ఏకంగా 37 లక్షల యూనిట్లు అమ్ముడవుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.  

కొత్తవారే ఎక్కువ..
పాత కార్లను కొంటున్న వారిలో 65 శాతం మంది కొత్త కస్టమర్లే. కొత్తగా డ్రైవింగ్‌ నేర్చుకోవడం, తక్కువ ధరలో వాహనం రావడంతోపాటు తమ బడ్జెట్‌లో మరింత మెరుగైన మోడల్, పెద్ద కారు వస్తుందని కస్టమర్లు భావిస్తున్నారు. ప్యాసింజర్‌ వాహన విపణిలో 70–75 శాతం మంది ఫైనాన్స్‌ ద్వారానే కొనుగోళ్లు జరుపుతున్నారు.

అవ్యవస్థీకృత రంగంలో సెకండ్‌ హ్యాండ్‌ కారుకు రుణం రావడం చాలా క్లిష్టమైంది. అదే బ్రాండెడ్‌ ప్రీ–ఓన్డ్‌ షోరూంలలో రుణం చాలా సులువు. అలాగే పాత కారుకు 100–120 రకాల నాణ్యతా పరీక్షలు చేసి కొత్త రూపు తీసుకొస్తారు. ఆర్గనైజ్డ్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందడానికి ఈ అంశాలే కారణం.

త్వరగా మార్చేస్తున్నారు..
నాలుగైదేళ్ల క్రితం వరకు సగటున ఆరేళ్లకు వాహనాన్ని మార్చేసి కొత్తది తీసుకునేవారు. ఇప్పుడు నాలుగు/నాలుగున్నరేళ్లకే మారుస్తున్నారని మహీంద్రా ఫస్ట్‌చాయిస్‌ ఎండీ నాగేంద్ర పల్లె సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ప్రీమియం కార్ల విషయంలో ఇంకా తక్కువ కాలానికే కారుకు గుడ్‌బై చెప్పేస్తున్నారని అన్నారు.

అమ్ముడవుతున్న 10 పాత కార్లలో ఏడు రూ.4 లక్షల లోపు ధరవే ఉంటే, కొత్త కార్ల విషయంలో 10లో ఎనిమిది రూ.8 లక్షలలోపు ధరలో ఉంటున్నాయట. పెద్ద, ఖరీదైన కార్లవైపు కస్టమర్లకు ఆసక్తి పెరిగిందని నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ అరుణ్‌ మల్హోత్రా తెలిపారు. వీరిని కొత్త టెక్నాలజీ ఊరిస్తోందని, నూతనతరం మోడళ్ల ప్రయోజనాలను అందుకోవాలన్న ఆసక్తి ఉంటోందని గుర్తుచేశారు.

హైస్ట్రీట్‌లో సైతం..
ఒకప్పుడు గల్లీలు, చిన్నరోడ్లలో పాత కార్ల విక్రయ కేం ద్రాలు, పార్కింగ్‌ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు బ్రాండెడ్‌ కార్ల షోరూంలకు దీటుగా అద్దెలు అధికంగా ఉండే హైస్ట్రీట్‌లకూ ఇవి విస్తరించాయి. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కొత్త కొత్త కేం ద్రాలు వెలుస్తుండటం ఇందుకు నిదర్శనం. కస్టమర్‌తో నేరు గా బేరమాడేందుకు వీలవడం, ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్‌కు మొగ్గుచూపేవారూ ఉన్నారు.

ఇదీ వాహన మార్కెట్‌..
దేశవ్యాప్తంగా ఏటా 30 లక్షల కొత్త కార్లు అమ్ముడవుతున్నాయి. పాత కార్ల విక్రయాలు 37 లక్షల యూనిట్లు దాటాయి. అయిదేళ్లలో ప్రీ–ఓన్డ్‌ మార్కెట్‌ 70 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని మహీంద్రా ఫస్ట్‌ చాయిస్‌ చెబుతోంది. యూజ్‌డ్‌ కార్ల విపణిలోకి దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు ప్రవేశించాయి. వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం ఉంది. మొత్తం పరిశ్రమ వృద్ధి 15 శాతం ఉంటే, ఆర్గనైజ్డ్‌ మార్కెట్‌ ఏకంగా 25–30 శాతం వృద్ధి చెందుతోంది. వారంటీ, ఉత్తమ సర్వీస్‌ ఉన్న కారణంగా కస్టమర్లు బ్రాండెడ్‌ యూజ్డ్‌ కార్ల షోరూంలకు రావడం పెరిగిందని వరుణ్‌ మోటార్స్‌ ఎండీ వరుణ్‌దేవ్‌ తెలిపారు.  

వ్యవస్థీకృత రంగానికి జీఎస్టీ దెబ్బ..
పాత కారు చేయి మారితే ఎటువంటి పన్ను పడటం లేదు. ఇది అవ్యవస్థీకృత రంగంలో ఉన్న విక్రేతలకు కలిసి వస్తోంది. అదే బ్రాండెడ్‌ ప్రీ–ఓన్డ్‌ కార్ల వ్యాపారంలో ఉన్న  కంపెనీలు మాత్రం వాహనాన్నిబట్టి మార్జిన్‌ మీద 29–51 శాతం జీఎస్టీ కట్టాల్సి వస్తోంది. జీఎస్టీకి పూర్వం ఉన్నట్టుగానే మార్జిన్‌ మీద 10–12 శాతం మాత్రమే పన్ను వ్యాట్‌  ఉండాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement