ఇక రూ.10 నాణేలే దిక్కు..!

Rural Banks Rely On Rs 10 Coins To Pay Customers - Sakshi

భోపాల్‌ : బ్యాంకుల్లో నగదు లేక, ఏటీఎంలు నో క్యాష్‌ బోర్డులతో వెక్కిరిస్తుంటే, దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. ఈ నగదు కొరతను సమస్యను తీర్చడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ రంగంలోకి దిగినప్పటికీ, పరిస్థితిలో అంత మార్పేమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా బ్యాంకులకు రూ.10 నాణేలే దిక్కయ్యాయి. కస్టమర్లు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వస్తే, వారికి గ్రామీణ బ్యాంకులు రూ.10 నాణేలను చెల్లిస్తున్నట్టు తెలిసింది. సాగర్‌, డామో, ఛతర్‌పూర్, తికంగఢ్ వంటి చిన్న ప్రాంతాల్లో ప్రైవేట్‌, పబ్లిక్‌ రంగ బ్యాంకులు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చిన వారికి రూ.10 నాణేలను ఇస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. 

‘ఏటీఎంలో డబ్బులు లేక, డ్రైగా మారిపోయాయి. 10వేల రూపాయలను విత్‌డ్రా చేసుకోవడానికి నేను సాగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచుకు వెళ్లాను. వారు రూ.10 కాయిన్ల రూపంలో వెయ్యి రూపాయలు నా చేతిలో పెట్టారు​’  అని సాగర్‌కు చెందిన వ్యవసాయదారుడు రామధీర్‌ పటేల్‌ తెలిపారు. చాలా బ్యాంకు శాఖలు కూడా 10వేల రూపాయల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలని పరిమితి విధించాయి. అయితే పెద్ద ఎత్తున నగదు కొరత ఏర్పడటంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రూ.2000 నోట్ల కొరత వెనుక ఏదో కుట్ర ఉందని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆరోపిస్తున్నారు. చాలా కోపరేటివ్‌ బ్యాంకు శాఖల్లో, ఇతర బ్యాంకు శాఖల్లో నగదు దొరకక ప్రజలకు అల్లాడుతున్నారు. తమ వద్ద సరిపడినంత బ్యాంకు బ్యాలెన్స్‌ ఉందని, కానీ కూతురు పెళ్లికి వాటిని విత్‌డ్రా చేసుకోవడమే కుదరడం లేదని ఓ వ్యవసాయదారుడు అన్నారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top