ఏడు రోజుల పతనానికి విరామం! 

Rupee Closes At 71.73 Against Dollar, Breaks 7-Day Losing Streak - Sakshi

రూపాయి 26 పైసలు రికవరీ

71.73 వద్ద ముగింపు  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి శుక్రవారం కొంత రికవరీ అయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ గురువారం ముగింపుతో పోలిస్తే 26 పైసలు బలపడి, 71.73 వద్ద ముగిసింది. ఏడు రోజుల వరుస ట్రేడింగ్‌ సెషన్స్‌లో రూపాయి విలువ జారుతూ ఏ రోజుకారోజు కనిష్టాల్లో కొత్త రికార్డులను నమోదుచేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జోక్యం రూపాయి పతనాన్ని శుక్రవారం కొంత నిరోధించినట్లు విశ్లేషణలున్నాయి. రూపాయిపై అంతర్జాతీయ అంశాలే తప్ప, దేశీయంగా ఎటువంటి ప్రతికూల ప్రభావాలూ లేవని, కరెన్సీ స్థిరత్వం త్వరలో సాధ్యమేననీ ప్రభుత్వ నుంచి వస్తున్న సానుకూల ప్రకటనలూ రూపాయి సెంటిమెంట్‌ను శుక్రవారం కొంత బలపరిచాయి.

ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి ఒక దశలో 72.04ను దాటినా, ఆపై కోలుకుంది. గురువారం 71.99 చరిత్రాత్మక కనిష్టస్థాయి వద్ద ముగిసిన రూపాయి శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 71.95 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో రూపాయి 71.65 వరకూ రికవరీ అయ్యింది. గురువారం ట్రేడింగ్‌లో ఒక దశలో రూపాయి 72ను దాటిపోయి, 72.11ను చేరింది. చివరకు కొంత రికవరీతో 71.99 వద్ద ముగిసింది.  ఇక క్రాస్‌ కరెన్సీలను చూస్తే, యూరో మారకపు విలువలో కొంత కోలకుని 83.70 నుంచి 83.25కు చేరింది. పౌండ్‌ విలువలో మాత్రం 93.08 నుంచి 93.19కి బలహీనపడింది. 

పెరిగిన ప్రభుత్వ రుణ భారం: కాగా, జూన్‌తో ముగిసిన మూడు నెలలకాలానికి కేంద్ర ప్రభుత్వ రుణ భారం రూ.79.8 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ మొత్తంలో బాండ్ల జారీ ద్వారా పబ్లిక్‌ డెట్‌ 89.3 శాతంగా ఉందని తెలిపింది. మార్చి 2018 నాటి రుణ భారం రూ.77.98 లక్షల కోట్లు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top