
కాళేశ్వరానికి రూ.11,400 కోట్ల రుణం
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి కావల్సిన నిధుల సమీ కరణకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కి రూ.11,400 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి కావల్సిన నిధుల సమీ కరణకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కి రూ.11,400 కోట్ల రుణం ఇచ్చేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఎల్లంపల్లి దిగువన కొండపోచమ్మ వరకు ఉన్న ఎనిమిది ప్యాకే జీల పనులకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుతామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.
ఈ మేరకు బుధవారం నీటి పారు దల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి బ్యాంకు తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా రూ.80,500 కోట్ల వరకు చేరడంతో, కార్పొ రేషన్ ద్వారా నిధులను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందే.
ఇందులో భాగం గానే ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ మొదలు ఎల్లంపల్లి వరకు (లింక్ –1) నిర్మాణ వ్యయం రూ.17,500 కోట్లలో రూ.7,400 కోట్ల రుణాన్ని ఆంధ్రా బ్యాంకు ఇస్తోంది. కాగా, ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ మీదుగా కొండపోచమ్మ సాగర్ వరకు పనులు జరగాల్సి ఉంది. ఇందులో ప్యాకేజీ 6–14 వరకు రూ.30వేల కోట్లు అవసరం. ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.
పోటాపోటీగా బిడ్లు...
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ల పను లకు ప్రముఖ సంస్థలు పోటాపోటీగా టెండ ర్లు వేశాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించి న 8ప్యాకేజీల పనులకు బుధవారం సాంకేతిక బిడ్లు తెరిచారు. మొత్తంగా రూ.11వేలకోట్ల విలువైన పనులకుగానూ ఎల్‌అండ్‌టీ, నవయుగ, హెచ్‌ఈఎస్, మెగా, రాఘవ, ఆఫ్కాన్స్, సత్య ఇన్‌ఫ్రా వంటి సంస్థలు పోటీ పడ్డాయి. వీటికి సంబంధించిన ప్రైస్ బిడ్లను ఈ నెల 18న తెరవనున్నారు.