Sakshi News home page

రాస్ నెఫ్ట్, ట్రాఫిగుర సంస్థల చేతికి ఎస్సార్ ఆయిల్

Published Fri, Oct 14 2016 12:22 AM

రాస్ నెఫ్ట్, ట్రాఫిగుర సంస్థల చేతికి ఎస్సార్ ఆయిల్

రేపు గోవాలో పుతిన్ సమక్షంలో ఒప్పందం
డీల్ విలువ రూ. 86,000 కోట్లు

 న్యూఢిల్లీ: ఎస్సార్ ఆయిల్ కంపెనీని రష్యా ఆయిల్ దిగ్గజం రాస్‌నెఫ్ట్, ఇతర సంస్థలతో కలిసి కొనుగోలు చేయనున్నది. రాస్‌నెఫ్ట్ కంపెనీ, యూరప్ కమోడిటీస్ ట్రేడర్ ట్రాఫిగుర, రష్యా ఫండ్ యూసీపీతో కలిసి ఎస్సార్ ఆయిల్ కంపెనీని 1,300 కోట్ల డాలర్లకు (రూ. 86,000 కోట్లు) కొనుగోలు చేయనున్నాయని సమాచారం. వాటాను విక్రయించిన తర్వాత ఎస్సార్ ఆయిల్‌లో 2 శాతం వాటా మాత్రమే ప్రస్తుత ప్రమోటర్లు, రుయా కుటుంబానికి ఉంటుంది.

ఈ డీల్‌లో భాగంగా ఎస్సార్ ఆయిల్ కంపెనీకి వున్న 450 కోట్ల డాలర్ల రుణ భారాన్ని కొనుగోలు సంస్థలు టేకోవర్ చేస్తాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై  రేపు(శనివారం) గోవాలో సంతకాలు జరిగే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోవాలో ఈ నెల 15-16 తేదీల్లో జరిగే బ్రిక్స్ సమావేశాల్లో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదురనున్నది.

 ఈ ఒప్పందంలో భాగంగా రాస్‌నెఫ్ట్ పీజేఎస్‌సీ సంస్థ 49 శాతం వాటాను, ట్రాఫిగుర గ్రూప్ పీటీఈ, యూసీపీలు కలసి మరో 49 శాతం వాటాను కొనుగోలు చేస్తాయి. ఈ డీల్‌లో వాదినర్ రిఫైనరీ, వాదినర్ పోర్ట్, 2,500కు పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి. రిఫైనరీకి సేవలందిస్తున్న విద్యుత్ ప్లాంట్, కంపెనీ కోల్ బెడ్ మీధేన్(సీబీఎం) బ్లాక్‌లు ఈ ఒప్పందం కిందకు రావు.

Advertisement
Advertisement