ఆయిల్, గ్యాస్‌ బ్లాక్‌ కోసం ఆర్‌ఐఎల్, బీపీ పోటీ

RIL-BP makes 1st oil block bid in a decade - Sakshi

ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి పోటీలోకి

వేదాంత, ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌ సైతం బిడ్లు దాఖలు

32 బ్లాక్‌లను ఆఫర్‌ చేస్తున్న కేంద్రం  

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్, దాని భాగస్వామి బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ పీఎల్‌సీ) ఎనిమిదేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఓ చమురు, సహజ వాయువు బ్లాక్‌ కోసం బిడ్‌ దాఖలు చేశాయి. వేదాంత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేయగా, ఓఎన్‌జీసీ 20 బ్లాక్‌లకు బిడ్లు వేసింది. ఓపెన్‌ యాకరేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ) రౌండ్‌– 2 కింద 14 బ్లాక్‌లు, ఓఏఎల్‌పీ– 3 కింద 18 ఆయిల్, గ్యాస్‌ బ్లాక్‌లతోపాటు 5 కోల్‌ బెడ్‌ మీథేన్‌ (సీబీఎం) బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది.

గతేడాది ఓఏఎల్‌పీ–1 కింద జరిగిన 55 బ్లాక్‌ల వేలంలో అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్‌ 41 బ్లాక్‌లను సొంతం చేసుకోగా, ఈ విడత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ఓఎన్‌జీసీ 20 బ్లాక్‌లు, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) 15 బ్లాక్‌లకు, ఐవోసీ, గెయిల్, సన్‌ పెట్రో ఒక్కోటీ రెండేసి బ్లాక్‌లకు పోటీపడినట్టు వెల్లడించాయి. కృష్ణా గోదావరి బేసిన్‌లో ఒక బ్లాక్‌ కోసం ఆర్‌ఐఎల్, బీపీ సంయుక్తంగా బిడ్‌ వేసినట్టు తెలిపాయి. 2011లో బీపీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టగా, అన్వేషణ బ్లాక్‌ కోసం పోటీపడడం ఇదే మొదటిసారి. ముకేశ్‌ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్‌ చివరిగా తొమ్మిదో విడత నూతన అన్వేషణ లైసెన్సింగ్‌ పాలసీలో భాగంగా ఆరు బ్లాక్‌లకు సొంతంగా బిడ్లు వేసినప్పటికీ ఒక్కటీ దక్కించుకోలేదు. ఆ తర్వాత ఎన్‌ఈఎల్‌పీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఓఏఎల్‌పీని తీసుకొచ్చింది.  

ఓఏఎల్‌పీ పాలసీ
దేశంలో 2.8 మిలియన్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో వెలుగు చూడని చమురు, గ్యాస్‌ నిక్షేపాలకు గాను, దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు ఓఏఎల్‌పీని కేంద్రం తీసుకొచ్చింది. దీనికింద ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ దశలో భాగం కాని ఏ ఇతర ప్రాంతానికి సంబంధించి అయినా ఆసక్తి వ్యక్తీకరించేందుకు కంపెనీలకు అవకాశం ఉంటుంది. తాము ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి పట్ల ఆసక్తిగా ఉన్నామం టూ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం సమీక్షించాక ఆయా ప్రాంతా లను వేలానికి ఉంచుతుంది. అప్పుడు కంపెనీలు వాటికి బిడ్లు వేయాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top