మళ్లీ వడ్డీ రేట్ల కోత చాన్స్‌..!

Retail inflation at 19-month low in January - Sakshi

సానుకూల ఆర్థిక గణాంకాలు

19 నెలల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

జనవరిలో కేవలం 2.05 శాతం

మందగమనంలో పరిశ్రమలు

డిసెంబర్‌లో కేవలం 2.4% వృద్ధి

న్యూఢిల్లీ:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరో దఫా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం)కు తగిన ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో  కేవలం 2.05 శాతంగా నమోదయ్యింది. గడచిన 19 నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఇక పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2018 డిసెంబర్‌లో కేవలం 2.4 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 7.3 శాతం. ధరలు తక్కువగా ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడడం నేపథ్యంలో ఏప్రిల్‌ 2 పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ మరోదఫా రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలకు మరింత బలం చేకూరింది.  

పారిశ్రామిక విభాగాలు వేర్వేరుగా...
► తయారీ: సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధిరేటు డిసెంబర్‌లో 8.7 శాతం  (2017 డిసెంబర్‌) నుంచి 2.7 శాతానికి (2018 డిసెంబర్‌) పడిపోయింది. అయితే 2018 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో ఈ రేటు 3.8 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలను నమోదుచేశాయి.  

► మైనింగ్‌: డిసెంబర్‌లో అసలు వృద్ధిలేకపోగా –1.0 శాతం క్షీణించింది. 2017 ఇదే నెలలో ఈ రేటు కనీసం 1.2 శాతంగా ఉంది. అయితే ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలానికి చూస్తే, వృద్ధి రేటు 2.9 శాతం నుంచి 3.1 శాతానికి పెరిగింది.  

► విద్యుత్‌: డిసెంబర్‌లో వృద్ధి అక్కడక్కడే 4.4 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో మాత్రం ఈ రేటు 5.1 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది.  

► క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ పెట్టుబడులకు, యంత్ర సామగ్రి కొనుగోలుకు సూచిక అయిన ఈ రంగంలో వృద్ధి రేటు 13.2 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది.

► కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: ఈ రంగంలో మాత్రం వృద్ధి 2.1 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగింది.

► కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌:  ఈ విభాగంలో ఉత్పాదకత వృద్ధి రేటు భారీగా 16.8 శాతం నుంచి 5.3 శాతానికి దిగజారింది.

జనవరిలో మరింత తగ్గిన ధరలు
జనవరిలో రిటైల్‌ ధరల పెరుగుదల వేగం (ద్రవ్యోల్బణం) కేవలం 2.05 శాతంగా ఉంది. 2018లో ఈ రేటు 5.07 శాతం. జనవరిలో మొత్తం ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం సూచీ పెరక్కపోగా –1.29 శాతం తగ్గింది. వేర్వేరుగా చూస్తే, గుడ్లు (–2.44 శాతం), పండ్లు (13.32 శాతం), కూరగాయలు (–13.32 శాతం), పప్పు దినుసులు (–5.5 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తుల (–8.16 శాతం) ధరలు 2018 ఇదే నెలతో పోల్చితే తగ్గాయి. అయితే మాంసం, చేపల ధరలు 5.06 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 1.45 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్‌ మీల్స్‌ ధరలు 3.48 శాతం పెరిగాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణంలో మరో నాలుగు ప్రధాన విభాగాలను చూస్తే... పాన్, పొగాకు, ఇతర మత్తు ప్రేరితాల విభాగం బాస్కెట్‌ ధర 5.62 శాతం పెరిగింది. దుస్తులు, పాదరక్షల విభాగంలో ధరల సూచీ 2.95 శాతం ఎగసింది. హౌసింగ్‌ ధర 5.20 శాతం పెరిగితే, ఫ్యూయెల్‌ అండ్‌ లైట్‌లో ద్రవ్యోల్బణం 2.20 శాతం పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top