ఐయూసీపై జాప్యం .. టెలికం సేవలకు ప్రతికూలం | Reliance Jio Says Delaying Zero IUC Beyond January 2020 To Hurt Service Affordability | Sakshi
Sakshi News home page

ఐయూసీపై జాప్యం .. టెలికం సేవలకు ప్రతికూలం

Nov 16 2019 5:41 AM | Updated on Nov 16 2019 5:41 AM

Reliance Jio Says Delaying Zero IUC Beyond January 2020 To Hurt Service Affordability - Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్‌కనెక్ట్‌ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2020 జనవరిలోగా ఎత్తివేయకుండా కొనసాగించిన పక్షంలో అందుబాటు రేట్లలో టెలికం సేవలను అందించడంపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిలయన్స్‌ జియో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ నిష్పత్తి దాదాపు సరిసమాన స్థాయిలో ఉందని, ఈ రెండింటి మధ్య భారీ అసమతౌల్యం ఉందన్న కారణంతో ఐయూసీ ఎత్తివేతను వాయిదా వేయడం సరికాదని  జియో డైరెక్టర్‌ మహేంద్ర నహతా పేర్కొన్నారు. ఐయూసీపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయాలు తెలిపారు. అటు, వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి.

ఐయూసీని సున్నా స్థాయికి తగ్గించేయరాదని, దీన్ని పూర్తిగా తొలగించే బిల్‌ అండ్‌ కీప్‌ (బీఏకే) విధానం అమలును మూడేళ్ల దాకా వాయిదా వేయాలని కోరాయి. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను అందుకున్నందుకు గాను ఆపరేటర్లు పరస్పరం చెల్లించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. 2020 జనవరి నుంచి దీన్ని పూర్తిగా ఎత్తివేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ .. కొనసాగించే అంశాన్నీ ట్రాయ్‌ పరిశీలిస్తోంది. టెలికం రంగంలో తీవ్ర సంక్షోభం గురించి ప్రభుత్వానికి తెలుసనే భావిస్తున్నామని, త్వరలోనే కేంద్రం ఊరట చర్యలేవైనా ప్రకటించవచ్చని ఆశిస్తున్నామని ఇన్వెస్టర్లతో సమావేశంలో వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement