Sakshi News home page

రిలాక్స్‌: బడ్జెట్‌లోనే పెద్ద కార్ల ధరలు!

Published Wed, Aug 9 2017 10:58 AM

రిలాక్స్‌: బడ్జెట్‌లోనే పెద్ద కార్ల ధరలు!

న్యూఢిల్లీ : పెద్ద కార్లకు రెక్కలు రాబోతున్నాయని, త్వరలోనే ఎస్‌యూవీ, లగ్జరీ కార్లపై ప్రభుత్వం సెస్‌ను మరింత పెంచనుందని గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 15శాతంగా ఉన్న సెస్‌ను 25 శాతం మేర పెంచుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే మీ బడ్జెట్‌కు మించి కార్లపై పన్ను రేట్లను పెంచదని టాప్‌ అధికారి చెప్పారు. మిడ్‌సైజ్‌, పెద్ద కార్లపై, ఎస్‌యూవీలపై 50 శాతానికి మించి జీఎస్టీ పెంచరని, అంటే 25 శాతం కంటే తక్కువగానే సెస్‌ను ప్రభుత్వం విధిస్తుందని తెలిపారు. 
 
ఒక్కసారిగా సెస్‌ పెంచబోతున్నారంటూ వార్తలు రావడంతో ఆటోమొబైల్‌ ఇండస్ట్రి నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జీఎస్టీ అమలు తర్వాత పన్ను రేట్లు తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించామని, గరిష్టంగా రూ.3 లక్షల వరకు ధరలు తగ్గించినట్టు కార్ల సంస్థలు చెప్పాయి. కానీ తాజాగా ఎక్కువ సెస్‌ విధింపుతో పన్ను రేట్లను పెంచుతుండటంతో, మళ్లీ కార్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటూ వాపోయాయి.
 
అయితే జీఎస్టీ నష్టపరిహారాల చట్టంలో తీసుకురాబోతున్న సవరణలలో మొత్తం పన్ను రేట్లు 50 శాతం కంటే తక్కువగానే ఉంచేలా చేస్తారని టాప్‌ అధికారి చెప్పారు. సెస్‌ పెంపు కూడా ఒకేసారి ఉండదని ఆ అధికారి తెలిపారు. అంతేకాక ఆగస్టు 12తో ముగుస్తున్న ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో దీనికి ఆమోదం లభించకపోతే, ప్రభుత్వం ఈ సెస్‌ పెంపుపై ఆర్డినెన్స్‌ తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. జీఎస్టీకి ముందు మిడ్‌ సైజు సెడాన్‌లపై 47 శాతం, ఎస్‌యూవీలపై 55 శాతానికి పైగా పన్ను రేట్లు ఉన్నాయి. కానీ జీఎస్టీ రావడంతో ఈ పన్ను రేట్లు 43 శాతానికి తగ్గాయి.

Advertisement
Advertisement