విశాఖ పోర్టులో తగ్గిన బొగ్గు దిగుమతులు | reduced coal imports in Visakhapatnam Port | Sakshi
Sakshi News home page

విశాఖ పోర్టులో తగ్గిన బొగ్గు దిగుమతులు

Sep 15 2017 12:23 AM | Updated on May 3 2018 3:20 PM

విశాఖ పోర్టులో తగ్గిన బొగ్గు దిగుమతులు - Sakshi

విశాఖ పోర్టులో తగ్గిన బొగ్గు దిగుమతులు

విశాఖ పోర్టులో బొగ్గు దిగుమతులు తగ్గాయని పోర్టు చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.

►  ప్రైవేటు పోర్టుల వైపు మొగ్గుచూపుతున్న దిగుమతిదారులు
► పోర్టు చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు


సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో బొగ్గు దిగుమతులు తగ్గాయని పోర్టు చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ «థర్మల్, స్టీమ్, కుకింగ్‌ రకాల బొగ్గు పోర్టులో దిగుమతి అవుతుందని చెప్పారు. వీటిలో థర్మల్, స్టీమ్‌ బొగ్గు దిగుమతి తగ్గిందని, కుకింగ్‌ రకం బొగ్గు దిగుమతి యథావిధిగా జరుగుతుందన్నారు.

విశాఖ పోర్టులో దిగుమతి అయిన సరుకును పది రోజుల వరకూ నిల్వ చేసుకోవచ్చని, తరువాతి రోజు నుంచి దీనిపై చార్జీలు వర్తిస్తాయని, ప్రైవేటు పోర్టుల్లో దిగుమతయిన సరుకును తొంభై రోజుల వరకూ ఎటువంటి రుసుం చెల్లించకుండా నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. ఈ వెసులుబాటు వల్లే దిగుమతిదారులు ప్రైవేటు పోర్టుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. కృష్ణపట్నం పోర్టుకు వచ్చే నౌకలకు భారీ రాయితీ ప్రకటించడంతోపాటు ఒక నౌకలోని కార్గోని మరో నౌకలోకి ఉచితంగా చేరవేస్తుండటంతో దిగుమతి దారులు ఆ పోర్టువైపు మొగ్గుతున్నారని వివరించారు. గతేడాదితో పొల్చితే ఒక మిలియన్‌ టన్ను వరకు బొగ్గు దిగుమతి తగ్గిందన్నారు.  

టేంప్‌ ప్రైవేటు పోర్టులకు వర్తించదు
టారిఫ్‌ అథారిటీ ఆఫ్‌ మేజర్‌ పోర్ట్స్‌ (టేంప్‌) నిబంధనలు ప్రైవేటు పోర్టులకు వర్తించనందున.. ఆయా పోర్టుల యాజమాన్యాలు ఎగుమతి, దిగుమతి ధరలను నిర్ణయించుకునే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మేజర్‌ పోర్టు బిల్లు అనుమతి పొందితే టేంప్‌ ఎత్తివేయబడుతుందని, దీని వల్ల మేజర్‌ పోర్టులు ఎగుమతి దిగుమతి ధరలను నిర్ణయించుకొనే వెసులుబాటు లభిస్తుందన్నారు.

పోర్టు స్థలాల అభివృద్ధి: విశాఖ పోర్టుకు సాలిగ్రామపురం, ఎయిర్‌పోర్టు, ఎన్‌ఏడీ ప్రాంతాలలో సుమారుగా 100 ఎకరాల స్థలం ఉందని చెప్పారు. ఈ స్థలాలను కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌కు ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. ఎయిర్‌పోర్టు వద్దనున్న 70 ఎకరాల స్థలాన్ని కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌కు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement