అర్ధరాత్రి వరకూ ట్రేడింగ్‌కు రెడీ

Ready for trading till midnight - Sakshi

అక్టోబర్‌ 1 నుంచి  ఎఫ్‌ అండ్‌ ఓ వేళలు పెంచుతాం

ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌  విక్రమ్‌ లిమాయే వెల్లడి

రజతోత్సవ వేడుకల్లో స్పష్టీకరణ

హాజరైన మాజీ ప్రధాని మన్మోహన్‌  

ముంబై: ట్రేడింగ్‌ వేళలను అర్ధరాత్రి వరకూ పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సీఈఓ విక్రమ్‌ లిమాయే స్పష్టంచేశారు. సెబీ ఆదేశాలకు అనుగుణంగా ప్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలో ట్రేడింగ్‌ను అక్టోబర్‌ 1 నుంచి రాత్రి 11.15 వరకూ పొడిగించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఈ కార్యకలాపాలు మొదలై 25 ఏళ్లు అయిన సందర్బంగా బుధవారం ఇక్కడ జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.  ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఈ కొత్త లోగోను ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ట్రేడింగ్‌ జరుగుతోంది. క్యాష్‌ మార్కెట్‌ ముగిసిన కొంత వ్యవధి తర్వాత రెండో సెషన్‌ సాయంత్రం 5 నుంచి ప్రారంభమై రాత్రి 11.15కు ముగుస్తుంది. అయితే, ఈ సెషన్‌లో డెరివేటివ్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. 

ఐపీఓ ఎప్పుడంటే...  
ఎన్‌ఎన్‌ఈ కో–లొకేషన్‌ సర్వర్లకు సంబంధించి వివాదంపై మాట్లాడుతూ... దీనిపై ఇప్పటికే తమ అంతర్గత దర్యాప్తును పూర్తి చేశామని.. దీనికి తగిన పరిష్కారం కోసం సెబీతో తాజాగా మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నామని తెలియజేశారు. కన్సెంట్‌ విధానంలో (నేరాన్ని అంగీకరించడం లేదా నిరాకరించడంతో సంబంధం లేకుండా జరిమానా రూపంలో కొంత చార్జీలను చెల్లించడం) దీన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు.  ‘ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ (రూ.10,000 కోట్లుగా అంచనా) ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కో–లొకేషన్‌ సమస్యతో ఇది ముడిపడి ఉంది. ఈ వివాదానికి పరిష్కారం ఎంత త్వరగా లభిస్తుందో అంత త్వరగా ఐపీఓ పూర్తవుతుంది’ అని లిమాయే వివరించారు. ఇక కమోడిటీ కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌ను కూడా అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమేనని చెప్పారు. ‘దీనికి  నియంత్రణ సంస్థ సెబీ అనుమతులు రావాల్సి ఉంది. ముందుగా బులియన్‌ (బంగారం, వెండి), ఇంధనం, మెటల్‌ వంటి వ్యవసాయేతర ఉత్పత్తులతో కమోడిటీ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాం’ అని వెల్లడించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని లిమాయే పేర్కొన్నారు. 

ఈక్విటీ, డెట్‌పై మరింత దృష్టి: చావ్లా 
వ్యాపార విస్తరణలో భాగంగా ఈక్విటీ, డెట్, వడ్డీరేట్లు ఫ్యూచర్స్‌ విభాగాలపై మరింత దృష్టి పెడతామని ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌ అశోక్‌ చావ్లా పేర్కొన్నారు.  అదేవిధంగా కంపెనీల నిధుల సమీకరణ వ్యయాలను కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కమోడిటీ ఫ్యూచర్స్‌లోకి ప్రవేశంతో ఎక్సే్ఛంజ్‌ టర్నోవర్‌ ఇంకాస్త జోరుందుకుంటుందని చావ్లా తెలిపారు. 

మరిన్ని శిఖరాలనుచేరాలి...: మన్మోహన్‌ 
సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1994లో దేశంలో రెండో ప్రధాన స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌గా ఆవిర్భవించి అనతి కాలంలో టర్నోవర్‌ పరంగా నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకిన ఎన్‌ఎస్‌ఈ.. ఇంకా మరెన్నో విజయ శిఖరాలను అధిరోహించాల్సి ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆకాంక్షించారు. అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఎన్‌సీఈ కార్యకలాపాలను ప్రారంభించింది మన్మోహన్‌ కావడం గమనార్హం. ‘1994లో దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై ఎవరికీ అంతగా విశ్వాసం లేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ రంగానికి గడ్డురోజులవి. అయితే, అవన్నీ తప్పని దేశ భవిష్యత్తుకు ఢోకాలేదని నిరూపించగలిగాం’ అని ఎన్‌ఎస్‌ఈ రజతోత్సవ వేడుకలో మన్మోహన్‌ పేర్కొన్నారు.  మార్కెట్, దేశ ఆర్థికాభివృద్ధితో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్‌ను మరింతగా సమ్మిళితం చేసే దిశగా ఎన్‌ఎస్‌ఈ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని మన్మోహన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉన్నా.. అనుకోని కారణాలతో రాలేకపోయా రు. ఆయన సందేశాన్ని చదవి వినిపించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top