ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్‌బీఐ నిష్క్రమణ 

RBI exit from NHB - Sakshi

కేంద్రానికి 100 శాతం వాటాలు

ముంబై: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ)లో రిజర్వ్‌ బ్యాంక్‌ తనకున్న పూర్తి వాటాలను కేంద్ర ప్రభుత్వానికి విక్రయించింది. అటు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) కూడా వాటాలన్నింటినీ విక్రయించడంతో ఎన్‌హెచ్‌బీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతికి చేరినట్లయింది. ఆర్‌బీఐ వాటాల విలువ రూ.1,450 కోట్లు కాగా, నాబార్డ్‌ వాటాల విలువ రూ. 20 కోట్లు. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో, ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో వాటాలు విక్రయించినట్లు ఆర్‌బీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

దీంతో ఇకపై ఈ రెండు సంస్థల్లోనూ 100 శాతం వాటాలు ప్రభుత్వానికే ఉంటాయని వివరించింది. బ్యాంకింగ్‌ రంగాన్ని నియంత్రించే ఆర్‌బీఐ అదే రంగ సంస్థల్లో వాటాలు కూడా కలిగి ఉండటం సరికాదన్న నరసింహం రెండో కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్‌ రంగానికి ఊతమిచ్చే యోచనతో 1987–88లో బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం ఎన్‌హెచ్‌బీ ఏర్పాటైంది. కాగా, వ్యవస్థలోకి మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో నిర్వహించిన రెండో విడత డాలర్‌/రూపాయి స్వాప్‌ వేలానికి మంచి స్పందన వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. 255 బిడ్స్‌ రాగా అయిదు మాత్రమే అంగీకరించినట్లు పేర్కొంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top