నిమిషానికో ఫోన్‌ విక్రయం | Sakshi
Sakshi News home page

నిమిషానికో ఫోన్‌ విక్రయం

Published Fri, Apr 19 2019 10:46 AM

Ram CHaran Launch Happy Mobile Shoowroom - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ హ్యాపీ మొబైల్స్‌... సగటున నిముషానికి ఒక స్మార్ట్‌ఫోన్‌ చొప్పున విక్రయిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 50 స్టోర్లతో 5 లక్షల మందికిపైగా కస్టమర్లకు చేరువైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 150– 200 ఔట్‌లెట్లు ప్రారంభిస్తామని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ వెల్లడించారు. తొలి స్టోర్‌ను ఆరంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈడీ కోట సంతోష్‌తో కలసి గురువారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘2018–19లో రూ.250 కోట్ల పైచిలుకు టర్నోవర్‌ సాధించాం. 2019–20లో రూ.500 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం 600 మంది ఉద్యోగులున్నారు. విస్తరణతో సిబ్బంది సంఖ్య 2,000 దాటుతుంది’ అని వివరించారు.

గంటలో ఫోన్‌ డెలివరీ...  
లక్షన్నర జనాభా ఉన్న పట్టణాల్లో ఔట్‌లెట్‌ను తెరుస్తున్నట్లు కృష్ణ పవన్‌ వెల్లడించారు. ‘‘ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరిస్తాం. వచ్చే ఏడాది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర మార్కెట్లలో అడుగు పెడతాం. హ్యాపీ స్టోర్‌ ఉన్న చోట కస్టమర్లు ఆన్‌లైన్లో ఆర్డరిస్తే గంటలో ఫోన్‌ను డెలివరీ చేస్తాం. త్వరలోనే ఈ సేవలను ప్రారంభిస్తున్నాం’’ అని వివరించారు. హ్యాపీ మొబైల్స్‌ ఒక్కో స్టోర్‌కు రూ.40–50 లక్షలు వెచ్చిస్తోంది. కొన్ని స్టోర్లలో ఎల్‌ఈడీ టీవీలు, వాక్యూమ్‌ క్లీనర్లు, సీసీ కెమెరాల వంటి లైఫ్‌స్టైల్‌ ప్రొడక్టులను విక్రయిస్తోంది. దశలవారీగా అన్ని స్టోర్లలో వీటిని అందుబాటులో ఉంచనుంది.  

40 శాతం క్యాష్‌బ్యాక్‌..
తొలి వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ హ్యాపీ డేస్‌ను ప్రకటించింది. రూ.5 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై 40 శాతం క్యాష్‌బ్యాక్‌ ప్రత్యేక ఆకర్షణ. స్మార్ట్‌ఫోన్లపై రెండేళ్ల వారంటీ ఉంది. వన్‌టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్, ప్రైస్‌ డ్రాప్‌ ప్రొటెక్షన్, బ్రాండెడ్‌ గిఫ్టులు కస్టమర్లు అందుకోవచ్చు. ఈ నెల 30 వరకు ఈ ఆఫర్లుంటాయి. ప్రతి మూడు నెలలకు హ్యాపీ డేస్‌ ఆఫర్లను పరిచయం చేస్తామని కోట సంతోష్‌ చెప్పారు. రిపీటెడ్‌ కస్టమర్లలో అత్యధికులు 18–26 ఏళ్ల వయసువారని చెప్పారాయన.

Advertisement
Advertisement