ప్రయాణికులకు చిన్న ప్రమాదం జరిగినా...

Railways Liable To Pay Compensation If Passenger Dies Boarding/Deboarding Trains - Sakshi

న్యూఢిల్లీ : రైల్వే ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు 'ప్రయాణికుల నిర్లక్ష్యం' అన్న సాకు చూపించే అవకాశం లేకుండా... ఏ చిన్న ప్రమాదం జరిగినా అందుకు తగ్గ పరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. రైలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తూ జారి పడి గాయాల పాలైనా లేదా ప్రాణాలు కోల్పోయినా.. అందుకు తగ్గ పరిహారం దేశీయ రైల్వేనే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయాణికులే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అనేందుకు వీలు లేదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ ఏకే గోయల్‌, ఆర్‌ఎఫ్‌ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పునిచ్చింది.

ప్రమాదాల బాధితులు రైల్వే శాఖ నుంచి నష్టపరిహారం పొందేందుకు అర్హులని తేల్చింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124 ఏ ప్రకారం బాధితులకు నష్టపరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సి వున్నప్పటికీ, పలు సందర్భాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ పరిహారం ఇవ్వకుండా  రైల్వే శాఖ తప్పించుకుంటోంది. ఓ మహిళ, 2002లో తన భర్త ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడిపోయిన సందర్భంగా తనకు రూ.4 లక్షల రూపాయల నష్టపరిహారం రైల్వే  చెల్లించాలని కోరుతూ కోర్టుకు ఎక్కింది. రెండో క్లాస్‌ ట్రైన్‌ టిక్కెట్‌ తీసుకున్న తన భర్త జతన్‌ గోప్‌, ప్రయాణికుల రద్దీతో రైలు నుంచి జారీ పడిపోయి మరణించారు. అయితే గోప్‌ ప్రయాణికుడు కాదని, రైల్వే ట్రాక్‌పై తిరుగుతూ ఉన్నాడని దేశీయ రైల్వే వాదించింది. కానీ జతన్‌ గోప్‌ టిక్కెట్‌ కొనడం తాను చూశానని, తన కళ్ల ముందే రైలు నుంచి పడిపోయి చనిపోయాడని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ప్రస్తుతం రైలు ప్రమాద కేసుల్లో హైకోర్టులు వివిధ రకాల తీర్పులను ఇస్తున్నాయి. ఇకపై ప్రమాదాలు జరిగితే పరిహారం రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top