లోకల్‌ బ్రాండ్లకు..  ‘పిక్‌ ఎన్‌ హుక్‌’ 

Pick n hook for local brands - Sakshi

వేగంగా ఉత్పత్తుల డెలివరీ

స్థానిక బ్రాండ్లకే ఎక్కువ ప్రాధాన్యం

కంపెనీ సీఈవో మోనిష్‌ పత్తిపాటి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అన్ని వస్తువులనూ విక్రయించే ఈ–కామర్స్‌ కంపెనీగా ఆరంభమైన హైదరాబాద్‌ కంపెనీ ‘పిక్‌ ఎన్‌ హుక్‌’... ఇపుడు మిగతా చోట్ల దొరకని విభిన్న ఉత్పత్తుల విక్రయంపై దృష్టిపెట్టింది. తెలంగాణ చేనేత.. నిర్మల్‌ బొమ్మలు.. గద్వాల, ధర్మవరం, వెంకటగిరి చీరలు, కొండపల్లి బొమ్మల వంటి ప్రత్యేక వస్తువులను దేశవ్యాప్తంగా విక్రయించే  ప్రయత్నాలు చేస్తోంది. మార్చి నుంచి ఈ వస్తువులన్నీ అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా ‘పిక్‌ ఎన్‌ హుక్‌’ ఫౌండర్‌ సీఈఓ మోనిష్‌ పత్తిపాటి ‘సాక్షి’ స్టార్టప్‌ డైరీతో తన అనుభవాల్ని పంచుకున్నారు.

అవి ఆయన మాటల్లోనే... ‘‘స్థానికంగా ఉండి, సొంతంగా వ్యాపారం చేయాలన్నదే నా కల. అందుకు తగ్గట్టే నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో బీబీఏ పూర్తి చేశాక 2016లో ‘పిక్‌ ఎన్‌ హుక్‌’ను ఆరంభించాం. రూ.కోటి పెట్టుబడితో మా నాన్నగారు ప్రసాద్‌ పత్తిపాటి సాయంతో ఆరంభించాం. ఆయనే చైర్మన్‌గా వెన్నంటి నడిపిస్తున్నారు. అనతికాలంలోనే లక్ష మందికిపైగా కస్టమర్లు వచ్చారు. 1,000కి పైగా వెండర్లు తమ ఉత్పత్తుల్ని మా ప్లాట్‌ఫామ్‌పై విక్రయిస్తున్నారు.

మంచి ధర.. వేగంగా డెలివరీ అనే రెండంశాలే మా ప్రత్యేకత.  ఈ ఏడాది మార్చి నుంచి కొత్త రూపుతో రంగంలోకి దిగుతున్నాం. యాప్‌తో పాటు వెబ్‌సైట్‌కు కూడా మరిన్ని ఫీచర్లు జోడిస్తాం. ఉత్పత్తుల శ్రేణి పెంచుతున్నాం. ఫ్రాడ్‌ డెలివరీని నిలువరించి క్వాలిటీ చెక్‌ వ్యవస్థను పటిష్టం చేశాం. తద్వారా ఫిర్యాదులు అర శాతం లోపే ఉంటున్నాయి. ప్రొడక్టుల ధరను సెల్లర్లే నిర్ణయిస్తారు. ఇక నిధుల విషయానికి వస్తే ప్రస్తుతానికి సొంత వనరులే ఖర్చు చేస్తున్నాం. నిధుల సమీకరణ గురించి మార్చి చివరికల్లా ఒక స్పష్టత వస్తుంది. పోటీ ఎంతున్నా ఈ రంగంలో నిలదొక్కుకుంటామన్న ధీమా ఉంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్లాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల్ని మా ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నాం. లోకల్‌ బ్రాండ్స్‌ను దేశ, విదేశాల్లో ప్రాచుర్యంలోకి తీసుకు రావాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని మోనిష్‌ వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top