చవకగా పెట్రోల్‌ కావాలా.. అయితే...

Petrol Price Hike Indian Tourists To Nepal Increases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యునికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. బండి తీసుకుని రోడ్డు మీదకి వెళ్లాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి వచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుదల, రూపాయి పాతాళానికి పడిపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు ఇలా ఒకటేమిటి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడానికి ఎన్నో కారణాలు కన్పిస్తున్నాయి. అయితే పొరుగుదేశం నేపాల్‌లో మాత్రం ఇంధన ధరలు సాధారణంగానే ఉన్నాయి. ఈ కారణంగా నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌ కోసం నేపాల్‌కు వెళ్తున్నారు. దూరం, సమయం గురించి ఆలోచించకుండా నేపాల్‌కు వెళ్లి అక్కడే పెట్రోల్‌, డీజిల్‌ రీఫిల్‌ చేయించుకుంటున్నారు. దీంతో నేపాల్‌ సరిహద్దు జిల్లాలు భారత ‘ఇంధన సందర్శకుల’తో కళకళలాడుతున్నాయి.

14 రూపాయలు తేడా..
ఉత్తరాఖండ్‌లోని చంపావట్‌ జిల్లా ఉద్ధమ్‌ నగర్‌లో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 82.63గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ ధర 74.90గా ఉంది. ఇదే సమయంలో భారత సరిహద్దులో గల నేపాల్‌లోని కాంచన్‌పూర్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 68. 20, డీజిల్‌ ధర రూ. 58.30గా ఉంది. కాగా ఈ రెండు జిల్లాల్లోని పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో సుమారు 14 రూపాయల వ్యత్యాసం ఉండటంతో కాంచన్‌పూర్‌ జిల్లాలో బిజినెస్‌ ఫుల్‌గా నడుస్తోంది. దీంతో ఉద్ధమ్‌నగర్‌ పెట్రోల్‌ బంకులన్నీ వెలవెలబోతున్నాయి.

పూట గడవాలంటే తప్పదుగా మరి..
రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో పొరుగు దేశానికి వెళ్లి మరీ పెట్రోల్‌ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఉద్ధమ్‌ సింగ్‌ నగర్‌ టాక్సీ యూనియన్‌ ప్రెసిడెంట్‌ రామ్‌ నరేశ్‌ జాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రోజూ 25 టాక్సీలను సరిహద్దులో ఉంచుతున్నాం. దీనికి నంబరింగ్‌ విధానం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరం వెళ్లి ట్యాంకు ఫుల్‌ చేయించుకుంటాం. కెపాసిటీకి అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ఫిల్‌ చేయిస్తున్నాం. ఇది కొంత రిస్క్‌తో కూడుకున్న పనే. అయితే పూట గడవాలంటే టాక్సీ నడపడం తప్పనిసరి కదా. ఇక్కడే పెట్రోల్‌, డీజిల్‌ కొని టాక్సీ నడపాలంటే.. మేం పస్తులు ఉండాల్సిందే అంటూ తమ బాధలు చెప్పుకొచ్చారు.

రోజుకి 7 లక్షలు.. నెలకి 2.5 కోట్ల రూపాయల నష్టం
పెట్రోల్‌ కోసం నేపాల్‌కు వెళ్తున్న వారి సంఖ్య పెరగిపోతుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ.. ఈ మూడు రాష్ట్రాల్లోని సరిహద్దు ఇంధన వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 7 లక్షల రూపాయల చొప్పున నెలకి 2.5 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నామన్నారు. అంతేకాకుండా కొంత మంది నేపాల్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి.. లాభానికి అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. దీంతో ఇటు బంకు వ్యాపారులు, అటు వినియోగదారులు నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు.

రూపాయి వ్యత్యాసం ఉన్నా సరే..
ఇక్కడి(భారత్‌) కంటే అక్కడి(నేపాల్‌) నుంచి తెచ్చే పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రూపాయి వ్యత్యాసం ఉన్నా సరే తమకు లాభమే కదా అంటున్నారు కొంత మంది వినియోగదారులు. ఉదాహరణకు 100 లీటర్లు కొనుగోలు చేస్తే 100 రూపాయలు ఆదా అవుతుంది. ఈ లెక్కన ఇంకో లీటరున్నర పెట్రోల్‌ వస్తుంది. ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. ప్రభుత్వం తమ గురించి పట్టించుకోకుండా అధర్మంగా వ్యవహరిస్తుంటే..తాము మాత్రం ఎందుకు ధర్మాన్ని అనుసరించాలని నిలదీస్తున్నారు. ఏదేమైనా సరే భారత్‌లో ఇంధన ధరలకు రెక్కలు రావడంతో తమ వ్యాపారం బాగా వృద్ధి చెందిందని, సుమారు రోజుకు 9 వేల లీటర్ల పెట్రోల్‌ అమ్ముతున్నామంటూ నేపాల్‌ కాంచన్‌పూర్‌ జిల్లా వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top