ఈ కంపెనీలకు అనూహ్య నష్టాలు

Paytm, Flipkart, MakeMyTrip, Swiggy, Zomato Huge Losses - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, మేక్‌మై ట్రిప్‌ ఇండియా, స్విగ్గీ, జొమాటో కంపెనీల పేర్లు మనం నిత్యం వింటూనే ఉంటాం. ఈ కంపెనీలు తమ తమ రంగాల్లో ప్రసిద్ధి చెందిన దిగ్గజ కంపనీలే. కనుక ఈ కంపెనీలకు భారీ ఎత్తున లాభాలు వస్తాయని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది పొరపాటు. ప్రతి ఏటా ఈ కంపెనీలకు నష్టాలే వస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ కలిపి ఉమ్మడిగా ఈ ఏడాదిలో అంటే, ఆర్థిక సంవత్సరం ముగిసే 2018, మార్చి నెల నాటికి 7,800 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఒక్క జొమాటో కంపెనీకి మినహా మిగతా అన్ని కంపెనీలకు గతేడాదితో పోలిస్తే భారీ నష్టాలు సంభవించాయని బిజినెస్‌ రీసర్చ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ‘టోఫ్లర్‌’ డేటా తెలియజేస్తోంది.

పేటీఎం, దాని మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్లు, పేటీఎం నుంచి విడిపోయిన పేటీఎం మాల్‌ కంపెనీలకు కలిపి ఈ ఏడాది 3,393 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మార్కెట్‌ వృద్ధి రేటు గణనీయంగా పెరిగే వరకు ఈ కంపెనీల పరిస్థితి ఇంతే. అది ఇప్పట్లో జరుగుతుందన్న సూచనలు లేవు. లాభాల మీద దృష్టిని కేంద్రీకరించకుండా, ఖర్చులకు వెరియకుండా ముందుగా మార్కెట్లోకి దూసుకపోయి, మంచి గుర్తింపు పొందడమే లక్ష్యంగా ఈ కంపెనీలు పనిచేయడంతో లాభాల జాడ కనిపించడం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు.

అమెజాన్‌తో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్‌ అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. అలాగే ఉబర్‌ కన్నా ఓలా పెద్దిదిగా ఎదిగింది. పోటీ కంపెనీలను అధిగమించి మార్కెట్లోకి తాము దూసుకుపోవాలనే తాపత్రయం కారణంగానే ఈ కంపెనీలు మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాయిగానీ, పేరుకు తగ్గట్లు లాభాలు గడించలేకపోయాయి. పైగా పెద్ద ఎత్తున నష్టాలను పోగుచేసుకున్నాయ. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు ఉండడం వల్ల ఎంత నష్టాలొచ్చినా ఈ కంపెనీలు ప్రస్తుతం మనుగడ సాగించకలుగుతున్నాయి. ఆసియా నుంచి కొత్త తరానికి చెందిన ‘బైడు, టెన్‌సెంట్, సాఫ్ట్‌బ్యాంక్‌’ పెట్టుబడిదారులు రావడం ఈ సంస్థలకు కలిసి వస్తోంది. (ఫ్లిప్‌కార్ట్‌ బిన్నీ రాజీనామా!!)

ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఓయో, ఓలా కంపెనీలు, అమెజాన్‌కు పోటీగా డిస్కౌంట్లతో ముందుకు పోయినంత కాలం ఈ కంపెనీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ‘ఎవరెస్ట్‌’ గ్రూపునకు చెందిన కన్సల్టింగ్, మార్కెటింగ్‌ పరిశోధనా సంస్థ ఉపాధ్యక్షుడు యుగల్‌ జోషి హెచ్చరించారు. ఎక్కడోచోట లాభాలకు బాట వేయకపోతే కంపెనీలతోపాటు పెట్టుబడిదారులు దారుణంగా మునిగిపోతారని నిపుణులు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top