జూలైలో వాహనాలకు బ్రేకులు | Passenger vehicle sales decline in July, first time in 9 months | Sakshi
Sakshi News home page

జూలైలో వాహనాలకు బ్రేకులు

Aug 11 2018 12:55 AM | Updated on Aug 11 2018 12:55 AM

Passenger vehicle sales decline in July, first time in 9 months - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల జోరుకు బ్రేకులు పడ్డాయి. గడిచిన తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో అమ్మకాలు క్షీణించాయి. గతేడాది జూలైలో జీఎస్‌టీ అమలు కారణంగా భారీ విక్రయాలు నమోదు కావటంతో ఈ సారి అప్పటితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) గణాంకాల ప్రకారం జూలైలో ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు 2,90,960 యూనిట్లకు తగ్గాయి. గతేడాది జూలైలో అమ్మకాలు 2,99,066 యూనిట్లు.

దేశీయంగా కార్ల అమ్మకాలు కూడా గత నెల స్వల్పంగా క్షీణించాయి. 2017 జూలైలో 1,92,845 కార్లు అమ్ముడవగా గత నెల 1,91,979కి తగ్గాయి. ‘జీఎస్‌టీ అమలు కారణంగా గతేడాది జూలైలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు ఒక్కసారిగా ఎగిశాయి. దానితో పోలిస్తే గత నెలలో అమ్మకాలు తగ్గినప్పటికీ అన్ని విభాగాలు పుంజుకోవడంతో పరిశ్రమ సంతృప్తిగానే ఉంది‘ అని సియామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుగతో సేన్‌ తెలిపారు.

ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో దేశీయంగా కోటి వాహనాల ఉత్పత్తి జరిగిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన 93 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 17% అధికమని వివరించారు. చాలా సంవత్సరాల తర్వాత పరిశ్రమలోని విభాగాలన్నీ వృద్ధి కనపరుస్తున్నాయని, మరో రెండేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగగలదని ఆశిస్తున్నట్లు సేన్‌ చెప్పారు. జీఎస్‌టీ కారణంగా గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎగిసిన అమ్మకాలతో పోలిస్తే రాబోయే రెండు నెలల్లో విక్రయాలు మందగించినట్లు కనిపించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  

అగ్రస్థానంలో మారుతీ సుజుకీ...
విక్రయాలు స్వల్పంగా తగ్గినప్పటికీ 1,52,427 వాహనాల అమ్మకాలతో జూలైలో దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ  అగ్రస్థానంలో నిల్చింది. హ్యుందాయ్‌ అమ్మకాలు 1.1% పెరిగి 43,481 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా కార్స్‌ ఇండియా 17% వృద్ధితో (19,970 వాహనాలు) మూడో స్థానానికి చేరింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు ఆరు శాతం క్షీణించి 19,739 యూనిట్లకు పరిమితమయ్యాయి.

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 16% పెరిగి 19,410 యూనిట్లుగా నమోదయ్యాయి. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు జూలైలో 8% పెరిగి 18,17,077 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో ఈ సంఖ్య 16,79,876 యూనిట్లు. హీరో మోటోకార్ప్‌ అమ్మ కాలు 12% పెరిగి 6,10,197 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌  విక్రయాలు 1,62,987 నుంచి 1,68,075 యూనిట్లకు చేరాయి. బజాజ్‌ ఆటో సంస్థ మోటార్‌ సైకిల్‌ అమ్మకాలు 22% వృద్ధితో 2,01,433 యూనిట్లుగా నమోదయ్యాయి.  టీవీఎస్‌ మోటార్స్‌ 1,12,238 వాహనాలను (25% వృద్ధి) విక్రయించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement