ఓలాలో 25 కోట్ల డాలర్ల  హ్యుందాయ్‌ పెట్టుబడులు

Ola, Hyundai in talks for $300 million fund infusion - Sakshi

4 శాతం వాటా కొనుగోలు 

తుది దశలో డీల్‌  ∙ ఓలా విలువ రూ.42,000 కోట్లు! 

బెంగళూరు: ట్యాక్సీ అగ్రిగేటర్, ఓలాలో హ్యుందాయ్‌ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నదని సమాచారం. ఓలా కంపెనీలో కొంత వాటా(సుమారుగా 4 శాతం) కొనుగోలు కోసం హ్యుందాయ్‌ 25 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  పెట్టుబడి సంబంధిత చర్చలు చివరి దశలో ఉన్నాయని,  మరికొన్ని వారాల్లో డీల్‌ కుదిరే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఓలాలో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ వాహన కంపెనీ ఇదే. ఈ వాటా విలువ పరంగా చూస్తే, ఓలా విలువ 600 కోట్ల డాలర్లను (రూ.42,000 కోట్లు)మించి ఉంటుందని అంచనా. తాజా పెట్టుబడుల సమీకరణలో భాగంగా ఓలా కంపెనీ 40 నుంచి 50 కోట్ల డాలర్ల నిధులను సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే హ్యుందాయ్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టనున్నది. కాగా  ఈ రౌండ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్‌ బన్సాల్, హాంగ్‌కాంగ్‌ హెడ్జ్‌ఫండ్‌ స్టీడ్‌వ్యూ క్యాపిటల్‌లు ఇప్పటికే అంగీకరించాయి. మిరా అసెట్‌–నవెర్‌ ఏషియా గ్రోత్‌ ఫండ్‌ కూడా 3–4 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదని సమాచారం. గతంలో వాహన కంపెనీలు ఈ తరహా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన దృష్టాంతాలు ఉన్నాయి. సెల్ఫ్‌–రైడ్‌ కంపెనీ జూమ్‌కార్‌లో మహీంద్రా, ఫోర్డ్‌ కంపెనీలు ఇన్వెస్ట్‌ చేశాయి. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. కాగా మార్కెట్‌ ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమని హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. 

హ్యుందాయ్‌కు ప్రయోజనం...
ఒక వేళ ఈ డీల్‌ సాకారమైతే, హ్యుందాయ్‌ కంపెనీకి మంచి ప్రయోజనాలే దక్కుతాయి. ఓలాకు చెందిన లీజింగ్‌ యూనిట్, ఓలా ఫ్లీట్‌ టెక్నాలజీస్‌కు హ్యుందాయ్‌ తన కార్లను విక్రయించగలుగుతుంది. త్వరలో మార్కెట్లోకి తేనున్న కోనా ఎలక్ట్రిక్‌ వెహికల్‌తో సహా మరిన్ని మోడళ్లను ఓలాకు విక్రయించగలుగుతుంది. ప్రస్తుతమున్న గ్రాండ్‌ ఐ10 తో సహా పలు మినీ కార్లలో ఎలక్ట్రిక్‌ వేరియంట్లను అందించాలని కూడా హ్యుందాయ్‌ యోచిస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఓలా, ఉబెర్‌లు దాదాపు 7–8 లక్షలకు పైగా  ట్యాక్సీలను నిర్వహిస్తున్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top