
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో గరిష్ట స్థాయిల నుంచి తగ్గిన క్రూడ్ ధర రూపాయి విలువకు కలిసివస్తోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం 29 పైసలు బలపడింది. 73.32 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి ట్రేడింగ్ 73.62 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత ఒకదశలో 73.31కి కూడా చేరింది.ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. ఈ కనిష్ట స్థాయిలను చూసిన తర్వాత రెండు రోజుల మినహా (సోమవారం, బుధవారం) మిగిలిన ఐదు ట్రేడింగ్ సెషన్‌లలో రూపాయి (100 పైసలకు పైగా) రికవరీ అవుతూ వస్తున్న విషయం గమనార్హం.
కారణాలు...
♦ అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో నాలుగున్నరేళ్ల గరిష్ట స్థాయి– 86.74ను తాకిన బేరల్ బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 80 స్థాయిలో ట్రేడవుతోంది.
♦ ఆరు దేశాల కరెన్సీలపై ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 96పైన నిలబడలేకపోవడం రూపాయి సెంటిమెంట్‌ను కొంత బలపరుస్తోంది.
♦ శుక్రవారం ఈక్విటీ మార్కెట్ పతనమైనప్పటికీ, ఫారిన్ ఫండ్స్ రూ.140 కోట్ల విలువైన షేర్లు కొన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.