చౌక ఇంటర్నెట్‌ : రూపాయికే వై-ఫై

చౌక ఇంటర్నెట్‌ - Sakshi

వై-ఫై ఇప్పుడు నిత్యావసర జాబితాలో చేరిపోయింది. వై-ఫై లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదేమో! అదే వైఫై ఇప్పుడు రోజూ తాగే టీ కంటే కూడా చవగ్గా అందుబాటులోకి వచ్చేసింది. ఛాయ్ దుకాణంలో కూర్చుని ఇంటర్నెట్‌ సర్ఫ్‌ చేసుకోవడమే కాకుండా... అదే ఛాయ్‌ దుకాణంలో, లేదా పక్కనే ఉన్న కిరాణా షాపుల్లో వై-ఫై కూపన్లను కొనుక్కొని ఎంచక్కా వాడుకోవచ్చు.

ఇందుకోసం ఢిల్లీ, బెంగళూరులోని ఈ స్టోర్లు, ప్రీ-పెయిడ్‌ వై-ఫై ప్యాక్స్‌లను అందించడానికి కొన్ని స్టార్టప్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రూపాయి నుంచి రూ.20 వరకు అందరికీ అందుబాటులో ఉండేలా కూపన్లను విడుదల చేస్తున్నాయి. పట్టణాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యంత చవగ్గా వైర్‌లెస్ ఇంటర్నెట్‌ను అందించడమే లక్ష్యంగా స్టార్టప్‌లు ఈ సర్వీసులను అందిస్తున్నాయి.

హరియాణా సరిహద్దులో ఉన్న ఢిల్లీలోని సంగం విహార్‌కు చెందిన ఓ స్టేషనరీ దుకాణ యజమాని బ్రహం ప్రకాశ్ ఇప్పటికే 250 వై-ఫై కూపన్లను విక్రయించాడు. రెండున్నర నెలల క్రితం తన దుకాణంలో వై-ఫై హాట్ ‌స్పాట్‌ను ఏర్పాటు చేశాడు. ఐదు నిమిషాల పాటు వై-ఫైను ఉపయోగించుకునేందుకు రూపాయి కూపన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో యువత ఎక్కువగా ఈ ప్యాక్‌లను కొనుగోలు చేస్తున్నారని అతను పేర్కొన్నాడు. రూపాయితో కొనుగోలు చేసిన వైఫైతో ఐదు నిమిషాల్లో తమకు కావాల్సిన గేములు, పాటలు డౌన్‌లోడ్‌ చేసుకుని వెళ్లిపోతున్నారని తెలిపాడు. తన వద్ద రూ.20 కూపన్లు కూడా ఉన్నాయని ప్రకాశ్ చెప్పుకొచ్చాడు. 

ఢిల్లీకి చెందిన 'ఐ2ఆ1', బెంగళూరుకు చెందిన 'వైఫై డబ్బా' స్టార్టప్‌లు పబ్లిక్ డేటా ఆఫీసు(పీడీవో)లు ప్రారంభించి ప్రతి ఒక్కరికి వై-ఫైని అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాక కిరాణా స్టోర్లలో రూటర్లను ఇన్‌స్టాల్‌ చేయడం 23 శాతం పెరిగిందని తమ అనాలసిస్‌లో వెల్లడైనట్టు ఐ2ఈ1 సహ వ్యవస్థాపకుడు సత్యం ధర్మోరా చెప్పారు. బెంగళూరు వ్యాప్తంగా 600 దుకాణాల్లో తాము వై-ఫై సేవలందిస్తున్నామని, 50ఎంబీపీఎస్‌ స్పీడులో 100-200 మీటర్ల రేడియస్‌ వరకు వైఫై అందిస్తున్నామని వైఫైడబ్బా సహ వ్యవస్థాపకుడు సుభేంద్‌ శర్మ చెప్పారు. అయితే ఖరీదైన ప్రాంతాల్లో మాత్రం వై-ఫై కూపన్లు అమ్ముడుపోవడం లేదని ఢిల్లీకి చెందిన ఓ టీస్టాల్ యజమాని వాపోయాడు. తాను ఇప్పటి వరకు ఒక్క కూపన్ కూడా విక్రయించలేదని, వై-ఫై రౌటర్‌ను  తిరిగి ఇచ్చేయాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం రూ.5 వై-ఫై కూపన్‌కు మంచి డిమాండ్ ఉందని ఓ షాప్ కీపర్ తెలిపాడు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top