వెనుక వైపు 5 కెమెరాలతో నోకియా ఫోన్‌

Nokia 9 Live Image Leak Tips 4150mAh Battery - Sakshi

నోకియా బ్రాండెడ్‌ ఫోన్‌ అంటే.. ఆ క్రేజే వేరు. నోకియా నుంచి ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్‌ వస్తుందంటే, టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఆశలను మరింత పెంచుతూ.. హెచ్‌ఎండీ గ్లోబల్‌ త్వరలో ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇమేజ్‌లు పలు సోషల్‌ మీడియా వెబ్‌సైట్లలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఇమేజ్లతో నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ అతిపెద్ద బ్యాటరీతో మార్కెట్‌లోకి వస్తుందని తెలుస్తోంది. అదేవిధంగా వెనుకవైపు పెంటా-లెన్స్‌‌(ఐదు లెన్స్‌ల) కెమెరా సెటప్‌ను ఇది కలిగి ఉందని సమాచారం. 

చైనాకు చెందిన ఓ సర్టిఫికేషన్‌ సైట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పాట్‌ అయింది. నోకియాపవర్‌యూజర్‌ వెబ్‌సైట్‌ కూడా నోకియా 9 లైవ్‌ ఇమేజ్‌ను లీక్‌ చేసింది. ఈ లీకేజీల్లో కూడా ఫోన్‌కు వెనుకవైపు ఐదు లెన్స్‌ల కెమెరా సెటప్‌ ఉందని తెలుస్తోంది. అంతేగాక.. ఈ ఫోన్‌ 4,150ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. అది నాన్‌ రిమూవబుల్‌ అట. ఈ లీక్డ్‌ డివైజ్‌ వెనుకవైపు నీలంగా ఉంది. అంటే నోకియా 9 కలర్‌ ఆప్షన్లలో నీలం రంగు ఒకటని తెలుస్తోంది. నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు నుంచి ఉత్పత్తి చేయడం ప్రారంభించింది హెచ్‌ఎండీ గ్లోబల్‌. ఈ నెలాఖరులో ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. నోకియా 9 'ఆండ్రాయిడ్‌ పై' ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడుస్తుందని అంతకముందు రిపోర్టులు వచ్చాయి. అంతేగాక.. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 6.01 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమరీ తదితర ఫీచర్లు ఉండనున్నాయట. అంతకముందు ఈ ఫోన్‌లో ముందువైపు మూడు కెమెరాలుండనున్నట్లు రిపోర్టులు తెలిపాయి. కానీ తాజా లీకేజీల ద్వారా నోకియా 9లో వెనుక వైపు ఐదు, ముందు వైపు మూడు కెమెరాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నోకియా 9లో మొత్తంగా 8 కెమెరాలున్నట్లు సమాచారం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top