నీతా అంబానీకి అరుదైన గౌరవం

Nita Ambani named to the board of largest US art museum - Sakshi

సాక్షి, ముంబై : రిఫైనింగ్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్  చైర్మన్ ముకేశ్‌ అంబానీ భార్య, దాత నీతా అంబానీ (57) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దేశ కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న ఆమె న్యూయార్క్‌లో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం బోర్డులో స్థానం దక్కించుకున్నారు. 

ప్రపంచం నలుమూలల నుండి కళను అధ్యయనం చేసి, ప్రదర్శించే మ్యూజియం సామర్థ్యానికి నీతా అంబానీ మద్దతు భారీ ప్రయోజనాన్ని చేకూర్చిందని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ చైర్మన్ డేనియల్ బ్రోడ్స్‌స్కీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే నీతా అంబానీని మ్యూజియం గౌరవ ధర్మకర్తగా ఎంపి‍క చేసినట్టు తెలిపారు.

మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ చైర్మన్ డేనియల్ బ్రోడ్స్‌స్కీ, సీఈవో, డైరెక్టర్లతో నీతా అంబానీ

కాగా  అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో పనిచేసిన మొదటి భారతీయ మహిళగా ఖ్యాతి గడించిన నీతా క్రీడల రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి భారత రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహాన్ అవార్డును అందుకున్నారు. అలాగే   ఆసియాలో అత్యంత శక్తివంతమైన 50 మంది వ్యాపారవేత్తల  ఫోర్బ్స్‌ జాబితాలో  ఒకరిగా నిలిచారు. రిలయన్స్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ రిలయన్స్‌ ఫౌండేషన్‌  ఛైర్మన్‌గా ఉన్న నీతా అంబానీ దేశీయంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం, సంస్కృతి,కళలు, క్రీడాభివృద్ధికోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ లో కూడా  ప్ర‌తి ఏడాది ఆమె షోలను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 149 సంవత్సరాల పురాతనమైన లాభాపేక్షలేని, మెట్రోపాలిటన్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా 5,000 సంవత్సరాల నుండి విస్తరించి ఉన్న కళలను ప్రదర్శిస్తుంది. ప్రతి ఏటా మిలియన్ల మంది బిలియనీర్లు, ప్రముఖులు ఈ  మ్యూజియాన్ని సందర్శిస్తారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top