11,900 పాయింట్లపైకి నిఫ్టీ

Nifty ups 11,900 points - Sakshi

బడ్జెట్‌పై ఆశావహ అంచనాలు  

130 పాయింట్ల లాభంతో 39,816కు సెన్సెక్స్‌

45 పాయింట్లు పెరిగి 11,910కు నిఫ్టీ

శుక్రవారం నాటి బడ్జెట్‌పై ఆశావహ అంచనాలతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి.  సెన్సెక్స్‌ 39,800 పాయింట్లు, నిఫ్టీ 11,900 పాయింట్లపైకి ఎగబాకాయి. ఆయిల్, గ్యాస్, ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌130 పాయింట్లు పెరిగి 39,816 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 11,910 పాయింట్ల వద్ద ముగిశాయి. ట్రేడింగ్‌ చివర్లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో  మధ్యాహ్న నష్టాలు రికవరీ అయ్యాయి. 

339 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌
తయారీ రంగ గణాంకాలు బలహీనంగా ఉండటం, జీఎస్‌టీ వసూళ్లు తగ్గడం, నైరుతి రుతుపవనాల విస్తరణ బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన... ఈ అంశాలన్నింటి కారణంగా రోజులో అధిక భాగం సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. అంతర్జాతీయంగా వృద్ధిపై ఆందోళన నెలకొనడం,  యూరప్‌ వస్తువులపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా యోచిస్తోందన్న వార్తలూ ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ పుంజుకొని లాభపడింది. మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. చివరి గంట వరకూ నష్టాల్లోనే ట్రేడైంది. బడ్జెట్‌పై ఆశలతో చివర్లో కొనుగోళ్లు జోరుగా సాగడంతో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 188 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ మరో దశలో 151పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 339 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ట్రేడైంది. ఫలితంగా ఐటీ షేర్లు లాభపడ్డాయి. 

ముంబైకి చెందిన రేడియస్‌ డెవలపర్స్‌ కంపెనీ రూ. 1,200 కోట్ల రుణంపై వడ్డీ చెల్లింపుల్లో విఫలమైందన్న వార్త కారణంగా యస్‌ బ్యాంక్‌ షేర్‌ 7.6 శాతం నష్టంతో రూ.101 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
రూ.50 కోట్ల కమర్షియల్‌ పేపర్‌ చెల్లింపుల్లో విఫలం కావడంతో కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ షేర్‌ 5 శాతం ల్యోయర్‌ సర్క్యూట్‌తో రూ. 32.95 వద్ద ముగిసింది.  
రెండు రోజుల లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 1 లక్ష కోట్లుపెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. లక్ష కోట్లు పెరిగి రూ.1,53,04,625 కోట్లకు పెరిగింది.  
స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసినప్పటికీ, 170కు పైగా కంపెనీల షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. టీవీఎస్‌ మోటార్, గ్రాఫైట్‌ ఇండియా, క్వెస్‌ కార్పొ, సుందరమ్‌–క్లేటాన్, కాక్స్‌అండ్‌ కింగ్స్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top