11,900 దిగువకు నిఫ్టీ

Nifty Slipped Below Its Crucial 11,900 Level - Sakshi

ప్రతికూలంగా అంతర్జాతీయ సంకేతాలు

పై స్థాయిల్లో లాభాల స్వీకరణ

248 పాయింట్ల పతనంతో 40,240కు సెన్సెక్స్‌

81 పాయింట్ల నష్టంతో 11,857కు నిఫ్టీ

అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఇంధన, ఐటీ షేర్లలో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,900 పాయింట్ల దిగువకు పడిపోయింది. 81 పాయింట్లు నష్టపోయి 11,857 పాయింట్ల వద్ద ముగిసింది. రోజంతా 379 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 248 పాయింట్ల పతనంతో 40,240 పాయింట్లకు పరిమితమయింది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో నెల గరిష్టానికి చేరినా, మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు.

ఆరంభంలోనే లాభాలు... 
డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉండటంతో వాహన విక్రయాలు నవంబర్‌లో 0.7 శాతం మేర తగ్గాయి. వృద్ధి బలహీనంగా ఉండటం, ద్రవ్యోల్బణం పెరుగుతుండటం.. ఈ రెండు అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు రేట్ల విషయమై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారంనాడు నిర్ణయాన్ని వెలువరించనుండటం, కీలకమైన ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారంలోనే వెలువడనుండటం తదితర కారణాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు.

సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు తప్పలేదు. ఆరంభంలో 101 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, ఆ తర్వాత 278 పాయింట్లు నష్టపోయింది. అమెరికా– చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
►యస్‌ బ్యాంక్‌ షేర్‌ 10 శాతం నష్టంతో రూ.50.55 వద్ద ముగిసింది.
►గత ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలను రూ.11,932 కోట్ల మేర తక్కువ చేసి చూపిందన్న వార్తల కారణంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) షేర్‌ 1% నష్టంతో రూ.313 వద్ద ముగిసింది. ఈ ప్రభావం ఇతర బ్యాంక్‌ షేర్లపైనా కూడా పడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top