మాట నుంచి డేటా దాకా!!

News about Telecom sector - Sakshi

హలో...!!  
ట్రంక్‌కాల్‌ బుక్‌ చేసి.. ఫోన్‌ కోసం వేచి చూసి... కాల్‌ దొరక్క, దొరికినా మాట సరిగా వినపడక మామూలు తంటాలా అవి.   మరిపుడు!! నడుస్తూ... పరిగెడుతూ... ప్రయాణంలో సైతం ఎంచక్కా నేరుగా  విదేశాల్లోని బంధుమిత్రులతోనూ క్షణాల్లో మాట్లాడేస్తున్నాం.   మరి ఆ వెయిటింగ్‌ దశ నుంచి ఈ చాటింగ్‌ దశకు రావటానికి మధ్య టెలికాం రంగం ఎన్ని కుదుపులకు గురైందో.. ఎన్ని ఎగుడుదిగుళ్లు చూసిందో తెలుసా? ‘హలో... మేమొచ్చేశాం’ అంటూ  ఎన్ని కంపెనీలు ఎన్ని లక్షల కోట్లు తెచ్చి గుమ్మరించాయో... అంతే వేగంగా ఎన్ని చాప చుట్టేశాయో...! విదేశాల్లో దిగ్గజ సంస్థలుగా మీసం మెలేసి... ఇండియాలో మాత్రం చేతులెత్తేసినవి ఒకటీ రెండూ కావు.  

ముకేశ్‌ అంబానీ ముచ్చటగా ఆరంభించిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌.. తమ్ముడి చేతికొచ్చేసరికి అగ్రస్థానంలోనే ఉంది. కానీ ఇపుడు...! పాతాళానికి పడిపోయింది. ఎందుకని? ఉప్పు నుంచి విమానాల వరకూ తమ చేతిలో ఉన్నాయని మురిసిపోయే టాటాలకు టెలికం మాత్రం కొరుకుడుపడలేదు. చివరికి కంపెనీని ఉచితంగా ఎయిర్‌టెల్‌కు అప్పగించేశారు. తప్పెక్కడ జరిగింది? రియల్టీ దిగ్గజంగా ఉన్న యూనిటెక్‌ గానీ, గృహోపకరణాల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన వీడియోకాన్‌ గానీ, చమురు దిగ్గజం ఎస్సార్‌ గానీ... ఇలా ఏవీ టెలికామ్‌లో రాణించలేకపోయాయి.  

విదేశాల్లో జెండా ఎగరేసిన హచిసన్, మ్యాక్సిస్, ఎంటీఎస్, సిస్టెమా శ్యామ్,  ఎయిర్‌సెల్, టెలినార్‌... ఇండియాలో మాత్రం పాగా వేయలేకపోయాయి. చివరకు మళ్లీ ముకేశ్‌ అంబానీ సొంతగా ఆరంభించిన జియో... ఎన్నో ఒడి దుడుకులను తట్టుకున్న  ఎయిర్‌టెల్, మార్పులకు చిరునామా అయిన ఐడియా, హచ్‌ను సొంతం చేసుకున్న వొడాఫోన్‌ మాత్రమే ప్రైవేటు రంగంలో మిగిలాయి. ఐడియా– వొడాఫోన్‌ విలీనమవుతున్న తరుణంలో ముచ్చటగా మిగులుతున్నవి మూడే. అంటే... ఏ రేసులోనైనా ఎంతమంది పాల్గొన్నా చివరకు 1–2–3 స్థానాలనే గుర్తించిన చందంగా మన టెలికం తయారైందన్న మాట.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top