భారత్‌కు వ్యాపార మెలకువలు నేర్పండి | Narendra Modi invites Indian-American business leaders to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు వ్యాపార మెలకువలు నేర్పండి

Sep 29 2014 1:03 AM | Updated on Aug 24 2018 2:17 PM

భారత్‌కు వ్యాపార మెలకువలు నేర్పండి - Sakshi

భారత్‌కు వ్యాపార మెలకువలు నేర్పండి

భారత్‌లోని ఔత్సాహికులకు వ్యాపార మెలకువలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లను నేర్పించాలని ఇండియన్-అమెరికన్ కార్పొరేట్ సారథులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

ఇండోఅమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూయార్క్: భారత్‌లోని ఔత్సాహికులకు వ్యాపార మెలకువలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లను నేర్పించాలని ఇండియన్-అమెరికన్ కార్పొరేట్ సారథులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వారిని భారత్‌కు రావాలని ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీతో ఆదివారం సుమారు 10 మంది టాప్ ఇండో అమెరికన్ సీఈఓల బృందం సమావేశమైంది. స్థిరమైన వ్యాపార వాతావరణం, మానవ వనులపై పెట్టుబడులు వంటి కొన్ని కీలక అంశాలను ఈ సందర్భంగా సీఈఓలు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. మానవ వనరుల అభివృద్ధి, పరిశోధన కార్యకలాపాల్లో తమ సహకారం విషయాన్ని గంటకుపైగా జరిగిన ఈ భేటీలో చర్చించారు.

మోదీని కలిసిన వారిలో సింఫనీ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ సీఈఓ రోమేష్ వాధ్వానీ, కాగ్నిజెంట్ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ, ప్రెసిడెంట్ శాంతను నారాయణ్, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ ప్రెసిడెంట్ రేణు ఖటార్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోహ్రియా, హార్మన్ ఇంటర్నేషనల్ ఇన్‌కార్పొరేటెడ్ సీఈఓ దినేష్ పాలివాల్, మైక్రోసాఫ్ట్ డెవలపర్ విభాగం కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ సోమశేగర్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేశ్ తదితరులు ఉన్నారు.

భారత్‌లో వృద్ధి అవకాశాల గురించి వీరంతా చాలా సానకూల దృక్పథాన్ని వ్యక్తం చేశారని.. తమ సూచనలను కూడా తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా చేసే లక్ష్యంగా తాజాగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని, ప్రజలు తమ వినూత్న ఆలోచనలు, సూచనలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఉద్దేశించిన ‘మై గవర్నమెంట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్’ ప్రాజెక్టుల గురించి సీఈఓలకు మోదీ వివరించినట్లు సమాచారం.
 
ఇదిలాఉండగా.. భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడం కోసం సోమవారం ఉదయం అమెరికాలో టాప్ కార్పొరేట్ దిగ్గజాల అధిపతులతో మోదీ భేటీ కానున్నారు. 30న వాషింగ్టన్‌లో యూఎస్‌ఐబీసీ నిర్వహిస్తున్న సమావేశంలోనూ ప్రధాని పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి 300-400 మంది వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement