ఇరాన్‌ పరిణామాలు, క్యూ3 ఫలితాలే దిక్సూచి

Muted market reaction to Iran strike overlooks key uncertainties - Sakshi

అమెరికాపై ప్రతీకార చర్య తప్పదన్న ఇరాన్‌

ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్‌

మార్కెట్‌పై ప్రభావం చూపుతోన్న ఈ కీలక పరిణామాలు

ఇన్ఫోసిస్, డీమార్ట్, ఇమామీ ఫలితాలు ఈవారంలోనే..

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ3 (అక్టోబర్‌ – డిసెంబర్‌) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. డ్రోన్‌ దాడి జరిపి తమ మిలటరీ కమాండర్‌ కాసిం సులేమానీని హతమార్చిన అమెరికాపై ప్రతీకార చర్య తప్పదని తాజాగా ఇరాన్‌ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లో సైతం ఒడిదుడుకులకు గురయ్యే ఆస్కారం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు.

అయితే.. కేంద్ర బడ్జెట్‌ సమీపిస్తుండడం వంటి సానుకూల సంకేతాలు మార్కెట్‌ను భారీ పతనం నుంచి నిలబెట్టేందుకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. భౌగోళిక రాజకీయ ప్రకంపనలు లాభాల స్వీకరణలకు ఆస్కారం ఇవ్వవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. తాజా పరిణామాలతో ముడిచమురు ధరలు పెరిగిపోగా.. ఈ వారంలో కూడా క్రూడ్‌ ర్యాలీ మరింత కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపేందుకు అవకాశం ఉందని ట్రేడింగ్‌ బెల్స్‌ సీనియర్‌ విశ్లేషకులు సంతోష్‌ మీనా అన్నారు.  

ఫలితాల ప్రభావం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఈ వారం నుంచే ప్రారంభంకానుంది. ఇన్ఫోసిస్, అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ (డీమార్ట్‌), ఇమామీ, ఐటీఐ, జీటీపీఎల్‌ హాత్వే కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి.  

స్థూల ఆర్థికాంశాలు...
గతేడాది డిసెంబర్‌ సర్వీసెస్‌ పీఎంఐ ఈ నెల 6న (సోమవారం) వెల్లడికానుండగా.. నవంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 10న (శుక్రవారం) వెల్లడికానున్నాయి.  

రూ. 2,418 కోట్ల పెట్టుబడి వెనక్కు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 2,418 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. అమెరికా–ఇరాన్‌ తాజా పరిణామాల కారణంగా 2020లో జనవరి 1–3 కాలంలో వీరు స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.  524 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.1,893 కోట్లు వెనక్కు తీసుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top