మొబైల్‌ సేవలు మరింత ప్రియం?

Mobile services are more expensive - Sakshi

టవర్లపై పన్నుల భారమే కారణం 

సీబీడీటీకి టవర్ల కంపెనీల సమాఖ్య లేఖ  

న్యూఢిల్లీ: టెలికం టవర్లకు పన్ను ప్రయోజనాలు లభించకపోవడం వల్ల సర్వీసులు మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయని టవర్, మౌలిక సదుపాయాల కల్పన సంస్థల సమాఖ్య టైపా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50,000 పైచిలుకు టవర్లు ఏర్పాటు కానుండగా, ఒక్కో దానిపై పన్నుల కింద రూ. 1–1.5 లక్షలు కట్టాల్సి రానుందని తెలిపింది.

ఫలితంగా టెలికం సర్వీసుల వ్యయాలు కూడా సుమారు 10 శాతం పెరుగుతాయని కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్‌ బోర్డు చైర్‌పర్సన్‌ వనజా ఎన్‌ సర్నాకి రాసిన లేఖలో టైపా డైరెక్టర్‌ జనరల్‌ తిలక్‌ రాజ్‌ దువా తెలిపారు. ఈ నేపథ్యంలో టెలికంయేతర ఇన్‌ఫ్రా సంస్థలకు ఇస్తున్న కొన్ని పన్ను ప్రయోజనాలను తమకూ వర్తింపచేయాలని, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లభించేలా జీఎస్‌టీలో తగు సవరణలు చేయాలని కోరారు.

భారతి ఇన్‌ఫ్రాటెల్, ఇండస్‌ టవర్స్, ఏటీసీ మొదలైన వాటికి టైపాలో సభ్యత్వం ఉంది. మొబైల్‌ టవర్‌ కంపెనీలు దేశవ్యాప్తంగా 4.5 లక్షల పైగా టవర్ల ఏర్పాటుపై రూ. 2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయని.. కార్పొరేట్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్, సర్వీస్‌ ట్యాక్స్‌ కింద ఏటా రూ. 5,000 కోట్లు చెల్లిస్తున్నాయని దువా తెలిపారు.

స్పెక్ట్రం హోల్డింగ్‌ పరిమితి పెంపునకు కమిషన్‌ మొగ్గు!
రుణాల్లో కూరుకున్న టెల్కోలు వైదొలిగేందుకు వెసులుబాటు కల్పించే దిశగా.. ఆపరేటర్ల స్పెక్ట్రం హోల్డింగ్‌ పరిమితిని పెంచాలన్న ట్రాయ్‌ సిఫార్సులపై టెలికం కమిషన్‌ సానుకూలంగా స్పందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టెలికం కమిషన్‌ ముసాయిదా ప్రతిపాదనలను క్యాబినెట్‌ తుది ఆమోదానికి ఈ వారంలో పంపే అవకాశాలు ఉన్నట్లు వివరించాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఏరియాలో ఏ ఆపరేటరుకూ 25 శాతానికి మించి స్పెక్ట్రం ఉండటానికి వీల్లేదు. అయితే, నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల్లో దీన్ని 50 శాతానికి పెంచాలని ట్రాయ్‌ సిఫార్సు చేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top