మైక్రోసాఫ్ట్‌లో 18 వేల ఉద్యోగాల కోత! | Microsoft Reportedly Set To Layoff Thousands | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌లో 18 వేల ఉద్యోగాల కోత!

Jul 18 2014 12:09 AM | Updated on Sep 2 2017 10:26 AM

మైక్రోసాఫ్ట్‌లో 18 వేల ఉద్యోగాల కోత!

మైక్రోసాఫ్ట్‌లో 18 వేల ఉద్యోగాల కోత!

అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఉద్యోగాల కోతకు తెరతీసింది.

న్యూయార్క్: అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఉద్యోగాల కోతకు తెరతీసింది. వచ్చే ఏడాది వ్యవధిలో 18 వేల మేర సిబ్బందిని తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ, భారత్‌కు చెందిన సత్య నాదెళ్ల గురువారం ప్రకటించారు. ఈ చర్యలు కఠినమైనవే అయినా... కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన నోకియా మొబైల్ డివైస్‌ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌తో అనుసంధానించేందుకు ఇవి తప్పనిసరి అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా రానున్న 12 నెలల్లో పన్ను ముందస్తు చార్జీల రూపంలో 1.6 బిలియన్ డాలర్లను(సుమారు రూ.9,600 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.

 సత్య నాదెళ్ల ఐదు నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి సిబ్బంది ఉధ్వాసన ప్రకటన కావడం గమనార్హం. అయితే, భారత్ చాలా కీలకమైన మార్కెట్‌గా నిలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాల కోతలు పెద్దగా ఉండకపోవచ్చ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. తమకు భారత్‌లో నోకియా డివెజైస్‌తోసహా 6,500 మంది ఉద్యోగులు ఉన్నారని.. మైక్రోసాఫ్ట్ సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం చాలా చాలా స్పల్పంగానే ఉంటుందని చెప్పారు.

 కాగా, ఈ 18,000 కోతల్లో సుమారు 12,500 వరకూ నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ బిజినెస్‌కు చెందిన నిపుణలు, ఫ్యాక్టరీ సిబ్బందివే ఉంటాయని సమాచారం. ప్రధానంగా మైక్రోసాఫ్ట్, నోకియా డివెజైస్‌ల మధ్య సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. తొలి విడతలో భాగంలో 13,000 సిబ్బందిని తగ్గించుకునే చర్యలను ప్రారంభించామని... వచ్చే ఆరు నెలల్లో ఎవరిని తొలగించబోతున్నామనేది ప్రకటిస్తామని నాదెళ్ల వెల్లడించారు.

 మొత్తానికి 2015 జూన్ నాటికి ఈ మొత్తం సిబ్బంది కోత ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గతేడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో 99,000 పూర్తిస్థాయి(ఫుల్‌టైమ్) సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 58,000 మంది అమెరికాలో, మిగతా 41,000 మంది ప్రపంచవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నోకియా డీల్ తర్వాత కంపెనీలోకి కొత్తగా వచ్చిచేరిన ఉద్యోగులు ఇందులో లేరు. 7.2 బిలియన్ డాలర్ల మొత్తానికి నోకియా మైబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రధానంగా 2009లో మైక్రోసాఫ్ట్ సుమారు 5,800 మంది ఉద్యోగులను తొలిగించిన తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో కోతలను ప్రకటించడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement